ఉదయ్‌పూర్ తరహాలోనే..


భాజపా నేత నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా మొదలైన అలజడి ఇంకా ఆగటం లేదు. ఉదయ్‌పూర్‌ ఘటనతో ఈ వివాదం ఇంకాస్త ముదిరింది. రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయి విభేదాలకు దారి తీసింది. ఇప్పుడు ఉదయ్‌పూర్‌ లాంటి ఘటనే మహారాష్ట్రలోని అమరావతిలో జరిగింది. నుపుర్ శర్మ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నట్టుగా ఉన్న ఓ పోస్ట్‌ని వాట్సాప్‌ గ్రూప్‌లో ఫార్వర్డ్ చేసినందుకు దుండగులు ఓ వ్యక్తిని హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి ఓ మెడికల్ షాప్ ఓనర్. నిజానికి గతనెల 21వ తేదీనే ఈ హత్య జరగ్గా..ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉదయ్‌పూర్‌ హత్య కేసుని ఎన్‌ఐఏకి అప్పగించిన కేంద్రం...ఈ కేసునూ ఆ సంస్థకే బదిలీ చేసింది. 


పక్కాప్లాన్‌తో మాటు వేసి హత్య..


నిజానికి ఉదయ్‌పూర్‌లో టైలర్ హత్య జరగటానికి ఓ వారం ముందే అమరావతి ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మెడికల్ షాప్ ఓనర్ ప్రహ్లాద్ రావు వాట్సాప్‌లో ఓ గ్రూప్‌లో మెసేజ్‌ ఫార్వర్డ్ చేశాడు. ఆ గ్రూప్‌లో ముస్లింలు కూడా ఉన్నారు. అది ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందన్న కోపంతో ప్రహ్లాద్‌రావుని హత్య చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. పక్కాగా ప్లాన్ చేసి ఈ హత్య చేసినట్టు తెలిపారు. షాప్‌ మూసేసి ఇంటికి వెళ్తున్న సమయంలో దారి కాచి దాడి చేసిన చంపినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్యలో వినియోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల్ని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. 


నుపుర్ శర్మకు లుకౌట్‌ నోటీసులు
 
నుపుర్ శర్మ మీడియా ముఖంగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఇప్పటికే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమె వ్యాఖ్యల కారణంగానే దేశవ్యాప్తంగా ఈ అలజడి మొదలైందని, ఉదయ్‌పూర్‌ ఘటనకూ ఆ వ్యాఖ్యలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ అంశంపై నుపుర్ శర్మ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. చర్చలో పాల్గొన్న సమయంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు నుపుర్ శర్మ సమాధానం మాత్రమే ఇచ్చారని వివరించారు. అయితే సుప్రీం కోర్టు మాత్రం టీవీ యాంకర్‌పైనా కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. చేసేదేమీ లేక పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇక నుపుర్ శర్మకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు కోల్‌కతా పోలీసులు. ఇప్పటికే నుపుర్ శర్మపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.