Kolkata High Court has disqualified defecting MLA: పార్టీ మారిన ఎమ్మెల్యేపై కోల్ కతా హైకోర్టు అనర్హతా వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతా పిటిషన్లపై విచారణ జరుగుతోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ టికెట్‌పై గెలిచిన ముకుల్ రాయ్ సభ్యత్వాన్ని కోల్‌కతా హైకోర్టు గురువారం రద్దు చేసింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఈ తీర్పు వచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణనగర్ ఉత్తర్ సీటు నుంచి బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్, ఎన్నికలు ముగిసిన ఒక నెలలోనే తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనపై అనర్హతా వేటు వేయాలని బీజేపీ నేత సువేందు అధికారి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ రెండేళ్ల పాటు విచారణ తర్వాత ముకుల్ రాయ్ పై అనర్హతా వేటు వేయాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పారు. దీనిపై సువేందు అధికారి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ అనర్హతను ప్రకటించడమే కాకుండా, అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ ఇచ్చిన నిర్ణయాన్ని కూడా రద్దు చేసింది. స్పీకర్ ముకుల్ రాయ్‌ను బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పి అనర్హత ప్రకటించకపోవడాన్ని కోర్టు తిరస్కరించింది.
ముకుల్ రాయ్ టీఎంసీలో సీనియర్ నేత. మాజీ రైల్వే మంత్రి, రాజ్యసభ సభ్యుడిగా టీఎంసీ నుంచి పనిచేసిన ఆయన, 2021 ఎన్నికలకు ముందు బీజేపీలో ఎమ్మెల్యేగా చేరి గెలిచారు. కానీ బీజేపీ అధికారంలోకి రాలేదు. దాంతో ఎన్నికలు ముగిసిన మే 2021లో తిరిగి తమ మూల పార్టీ టీఎంసీలో చేరారు. ఆ తర్వాత ఆయనను మమతా బెర్జీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ పదవి సాధారణంగా ప్రతిపక్ష సభ్యుడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన బీజేపీ అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేనే అని చెప్పి మమతా బెనర్జీ పీఏసీ పదవి ఇచ్చారు. రాజ్యాంగ పదవ షెడ్యూల్ ప్రకారం, ఏ పార్టీ సభ్యుడైనా తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే లేదా పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేస్తే అనర్హుడవుతారు. ఈ నిర్ణయం తీసుకోవడం స్పీకర్ బాధ్యత, కానీ సమయ పరిమితి లేదు.
ఇలాంటి కేసులో తెలంగాణలో పది ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మందిపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ న్యాయపోరాటం చేస్తోంది.సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. ఒక వేళ స్పీకర్ వారు పార్టీ మారలేదని నిర్ణయాన్ని తిరస్కరిస్తే కోల్ కతా హైకోర్టు తీర్పు ఆధారంగా.. సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ ప్రారంభమయింది.
మరో వైపు టీఎంసీ ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం.. అనర్హతా వేటుపై నిర్ణయం తీసుకోవాల్సింది కేవలం స్పీకర్ మాత్రమేనని.. అసెంబ్లీ అధికారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని అంటోంది. ఈ కేసు భారత రాజకీయాల్లో కీలకం అయ్యే అవకాశం ఉంది.