Kerala renaming row: కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా  కేరళం (Keralam)గా మార్చాలనే ప్రతిపాదన ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో కేరళలోని అధికార ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వానికి, ప్రతిపక్ష బిజెపి మద్దతు ప్రకటించడం ఒక అనూహ్య పరిణామంగా మారింది. కేరళ అసెంబ్లీ ఇప్పటికే ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించగా, దీనికి రాష్ట్ర బిజెపి నేతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. మలయాళ భాషలో ప్రాచీన కాలం నుండి వాడుకలో ఉన్న కేరళం  అనే పదాన్నే అధికారికంగా అన్ని రాజ్యాంగ పత్రాల్లో చేర్చాలని రాష్ట్రం కోరుతోంది.

Continues below advertisement

లెఫ్ట్ డిమాండ్ ను సమర్థించిన బీజేపీ                     

సాధారణంగా కేరళ రాజకీయాల్లో ఎల్.డి.ఎఫ్ ,  బిజెపి మధ్య తీవ్రమైన సైద్ధాంతిక వైరుధ్యాలు ఉంటాయి. అయితే, రాష్ట్ర అస్తిత్వం,  సాంస్కృతిక వారసత్వం విషయంలో మాత్రం బిజెపి రాష్ట్ర విభాగం ప్రభుత్వ నిర్ణయానికి వెన్నుదన్నుగా నిలిచింది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లోనూ రాష్ట్రం పేరును  కేరళంగా మార్చాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్రాన్ని కోరారు. ఈ డిమాండ్‌ను సమర్థిస్తూ, రాష్ట్ర బిజెపి నేతలు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యాన్ని కోరుతూ లేఖలు రాశారు. 

Continues below advertisement

పేరు మార్పు రాజకీయాలు చేస్తున్న కమ్యూనిస్టులు                      

ఈ పేరు మార్పు వెనుక బలమైన చారిత్రక కారణాలు ఉన్నాయని కేరళ ప్రభుత్వం వాదిస్తోంది. మలయాళ భాషా ప్రాతిపదికన కేరళ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి స్థానికులు తమ రాష్ట్రాన్ని  కేరళం అనే పిలుచుకుంటారు. అయితే రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మాత్రం ఇప్పటికీ 'కేరళ' అనే ఉండిపోయింది. బ్రిటీష్ కాలం నాటి ఉచ్ఛారణలను వదిలించుకుని, స్థానిక సంస్కృతికి అద్దం పట్టేలా పేరు మార్చాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. గతంలో మద్రాస్ ను  చెన్నైగా, బాంబేను ముంబైగా మార్చిన తరహాలోనే ఈ మార్పు జరగాలని కేరళ ప్రభుత్వం కోరుతోంది. 

రాజ్యాంగసవరణ చేయాల్సి ఉంటుంది!                   

ఈ ప్రక్రియ అంత సులభం కాదు. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే రాష్ట్రం పేరును మార్చడం సాధ్యమవుతుంది. రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలించి, పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిజెపి కూడా ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఉండటంతో, కేంద్ర ప్రభుత్వం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా దేశీయ భాషలు, సంస్కృతులకు ప్రాధాన్యత ఇవ్వాలని పలుమార్లు పిలుపునిచ్చినందున ఈ పేరు మార్పుకు కేంద్రం పచ్చజెండా ఊపే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ పరిణామం కేరళ రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదా భాషాభిమానం కోసం బద్ధశత్రువులైన రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావడం కొత్త తరహా రాజకీయమే.