Kerala Name Change: కేరళ ఇకపై కేరళం - కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
Keralam: కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ ను తీర్చింది.

Kerala Name Change Union Cabinet Approves: రాష్ట్రం పేరును మార్చాలంటూ కేరళ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మలయాళ భాషలో రాష్ట్రం పేరును కేరళం అని పిలుస్తారని, అయితే రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో ఇప్పటికీ కేరళ అనే ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మార్పు ద్వారా మలయాళీ ప్రజల సాంస్కృతిక అస్తిత్వాన్ని, భాషా గౌరవాన్ని జాతీయ స్థాయిలో ప్రతిబింబించేలా అడుగులు పడ్డాయి.
ఈ పేరు మార్పు ప్రక్రియ సాఫీగా సాగాలంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం సవరణలు చేపట్టాల్సి ఉంటుంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించినందున రాబోయే పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పొందుపరిచిన అన్ని భాషల్లోనూ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
వాస్తవానికి కేరళ అసెంబ్లీ గత ఏడాదిలోనే రాష్ట్రం పేరు మార్పుపై ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరూ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. మలయాళీ సమాజం తమ రాష్ట్రాన్ని దశాబ్దాలుగా కేరళం అని పిలుచుకుంటున్నప్పటికీ, అధికారిక రికార్డుల్లో కేరళ అని ఉండటం సరైంది కాదని వారు వాదించారు. ఈ ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవడం విశేషం.
Union Cabinet approves the proposal for alteration of name of State of ‘Kerala’ as ‘Keralam’ pic.twitter.com/uVydvy5fFl
— ANI (@ANI) February 24, 2026
కేంద్రం తుది ఆమోదం తెలిపి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత, అన్ని ప్రభుత్వ రికార్డులు, పాఠ్యపుస్తకాలు , బోర్డులపై రాష్ట్రం పేరు కేరళం గా మారుతుంది. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, ఒక రాష్ట్రం తన భాషా మూలాలను వెతుక్కుంటూ సాగించిన ప్రయాణంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా వంటి రాష్ట్రాలు తమ పేర్లను మార్చుకున్న బాటలోనే ఇప్పుడు కేరళం కూడా నిలిచింది.























