Kozhikode elderly woman Courage: రోడ్ల మీద ఎవరూ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించరు. చాలా మంది పుట్ పాత్ మీద బైకులతో వచ్చేస్తారు. వీరిని ఎవరూ ప్రశ్నించడానికి ధైర్యం చేయలేరు. కానీ కొంత మంది ఉంటారు.. వారికి భయం ఉండదు. వారిలో ఈ బామ్మ ముందుంటారు. కోజికోడ్ నగరంలోని ఎరన్హిపాలం జంక్షన్ వద్ద రద్దీగా ఉన్న సమయంలో, ఒక వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ తప్పించుకోవడానికి తన స్కూటర్‌ను ఫుట్‌పాత్‌పైకి ఎక్కించాడు. చాలామంది భయంతో పక్కకు తప్పుకుంటున్నా, 73 ఏళ్ల ప్రభావతి అనే మహిళ మాత్రం వెనక్కి తగ్గలేదు. వాహనదారుడు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించినా, ఆమె అడ్డుగా నిలబడి ఫుట్‌పాత్ నడిచేవారికే కానీ బండ్ల కోసం కాదని గట్టిగా నిలదీశారు.
ఆమె పట్టుదలను చూసి సదరు వాహనదారుడు వాదనకు దిగినప్పటికీ, బామ్మ తన మొబైల్ ఫోన్ తీసి బండి నంబర్‌ను ఫోటో తీయడం ప్రారంభించారు. ఆ ధైర్యానికి, సామాజిక స్పృహకు కంగుతిన్న ఆ వ్యక్తి, చివరికి తన తప్పు తెలుసుకుని వెనక్కి తిరిగి ప్రధాన రహదారిపైకి వెళ్లక తప్పలేదు. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో, అది కాస్తా వైరల్ అయ్యి నిజమైన హీరో అంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
సాధారణంగా ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు గొడవ ఎందుకని పక్కకు తప్పుకుంటాం కానీ, నిబంధనలను ఉల్లంఘించే వారికి అక్కడికక్కడే బుద్ధి చెప్పడం ద్వారా ఆమె ఒక సామాజిక బాధ్యతను ప్రదర్శించారు. ప్రభుత్వం కూడా ఆమె సాహసాన్ని గుర్తించి, కేరళ మోటార్ వాహనాల శాఖ ఆమెను ప్రత్యేకంగా సన్మానించింది.
వ్యవస్థ మారాలని కోరుకోవడం కంటే, మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే ధైర్యం మనలో ఉండాలని ఆమె నిరూపించారు. చదువు అంటే కేవలం ఉద్యోగం సంపాదించడం మాత్రమే కాదు, తోటివారి హక్కులను గౌరవించడం , సామాజిక క్రమశిక్షణను పాటించడం కూడా అని ఆమె చేతల్లో చూపారు. తెలంగాణ హోంశాఖ కార్యదర్శి సీవీ ఆనంద్ కూడా ఆమె నుంచి చాలా నేర్చుకోావాల్సి ఉందని ప్రశంసించారు.
ట్రాఫిక్ నిబంధనలు కేవలం జరిమానాల కోసం కాదు, మన ప్రాణాల రక్షణ కోసమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పోలీసులు ప్రతి అడుగులోనూ ఉండలేకపోవచ్చు, కానీ బాధ్యత గల పౌరులే అడుగడుగునా నిఘా నేత్రాలైతే ఇలాంటి ఉల్లంఘనలకు తావుండదని నెటిజన్లు అంటున్నారు.