నెలన్నర రోజుల కిందటే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక రోజులో లక్షల్లో నమోదైన కోవిడ్19 కేసులు దాదాపు 40 వేలకు దిగొచ్చాయి. మరోవైపు కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంటే దాదాపుగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలను సడలించాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే మరోవైపు కేరళ రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. 


కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో మరోసారి వీకెండ్ లాక్‌డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా జులై 31, ఆగస్టు 1 తేదీలలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులలో దాదాపు 40 శాతం మేర కేసులు కేరళ నుంచి రావడం గమనార్హం. ఈ రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదుకావడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆరుగురు సభ్యుల టీమ్‌ను కేరళకు పంపాలని నిర్ణయం తీసుకుంది. 


కేరళలో కరోనా వ్యాప్తి అధికం కావడంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందించారు. గత కొన్ని రోజుల నుంచి దేశంలో నమోదవుతున్న కరోనా కేసులలో అధికంగా కేరళలోనే నిర్ధారణ అవుతున్నాయని చెప్పారు. కరోనా కట్టడి చర్యలలో కేరళ ప్రభుత్వానికి తమ సహకారం అందిస్తామన్నారు. ఆరుగురు సభ్యుల టీమ్ ఆ రాష్ట్రానికి వెళ్లి పరిస్థితులను సమీక్షిస్తుందన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో తక్కువ సమయంలోనే కోవిడ్19 వ్యాప్తిని అరికట్టి శభాష్ అనిపించుకున్న రాష్ట్రం కేరళలో పరిస్థితి అదుపు తప్పుతోంది.  


గత రెండు వారాల కిందట దేశంలో నమోదవుతున్న కేసులలో 30 శాతంగా ఉన్న కేరళ కరోనా కేసులు ప్రస్తుతం 40 శాతానికి చేరుకోవడం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి వారం వీకెండ్ లాక్‌డౌన్ మాత్రమే విధిస్తూ కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే కరోనా వ్యాక్సినేషన్ వేగంగా చేస్తున్నా, పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేరళ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులతో కొత్త వేవ్ సైతం వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కేరళలో త్వరగా కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.


కేరళలో బుధవారం నాడు 22,056 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు. మరో 131 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకూ 33,27,301 మంది కరోనా బారిన పడగా, మొత్తం కోవిడ్19 మరణాల సంఖ్య 16, 457కు చేరుకుంది. ఐసీఎంఆర్ ప్రకారం జూన్ 14 నుంచి జులై 6 తేదీల మధ్య ఈ రాష్ట్రంలో కోవిడ్ యాంటీబాడీలు 44.4 శాతం మందిలో ఉన్నాయని గుర్తించారు. కానీ కరోనా కేసులు మాత్రం అదుపులోకి రావడం లేదు.