భార్యలు కూడా ఇప్పుడు రేప్ కేసులు పెట్టవచ్చు. ఆమెకు ఇష్టం లేకుండా బలవంతంగా భర్త అయిన శృంగారానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది అత్యాచారమే అవుతుందని కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య సహధర్మచారణి అంత మాత్రాన...భార్య దేహాన్ని భర్త పూర్తిగా తన ఆస్తిగా భావించడం తప్పని ధర్మాసనం స్పష్టం చేసింది. కేరళకు చెందిన ఓ మహిళ క్రూరత్వం కారణంగా చూపిస్తూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను విచారమ జరిపిన ఫ్యామిలీ కోర్టు మహిళ కోరుకున్నట్లుగా విడాకులు మంజూరు చేసింది. అయితే ఇలా విడాకులు ఇవ్వడం కరెక్ట్ కాదని వాదిస్తూ.. భర్త హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణలోనే న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు.
పెళ్లి అయిన తర్వాత ఆమెకు ఇష్టం ఉన్నా లేకపోయినా భార్యతో శృంగారం చేయడం భర్త హక్కు అని సమాజం భావిస్తూ ఉంటుంది. అయితే గతంలో భార్యకు ఇష్టం లేకుండా శృంగారం చేసినా అది రేప్ కిందకే వస్తుందని కొన్ని కో్టులు తీర్పులు ఇచ్చాయి. అయితే.. ఈ వైవాహిక అత్యాచారాన్ని శిక్షార్హంగా చట్టంలో గుర్తించలేదు. కానీ విడాకులు మంజూరు చేయడానికి ఈ కారణం సరిపోతుందని.. హైకోర్టు స్పష్టం చేసింది. ఇష్టం లేకపోయినా శృంగారం చేసిన కారణంగా విడాకులు కోరడం సబబేనని అభిప్రాయపడుతున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. భార్య శరీరంపై తనకు పూర్తి హక్కులు ఉన్నట్లు భర్త భావించడం, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక చర్యల్లో పాల్గొనడం వైవాహిక అత్యాచారం కిందే లెక్కేనని తేల్చారు. విడాకుల మంజూరును సమర్థించింది. భర్త అప్పీళ్లను కొట్టివేసింది. దీంతో భర్తకు షాక్ తగిలినట్లయింది. విడాకుల కోసం పోరాటం చేసిన ఆ మహిళ చివరకు తాను అనుకున్నట్లుగా బలవంత శృంగారం చేస్తున్న భర్త నుంచి విముక్తి పొందింది.
విడాకుల కేసులోనే కాదు.. కేరళ హైకోర్టు అత్యాచారం విషయంలో మరో బెంచ్ మార్క్ తీర్పును కూడా రెండు రోజులకిందట ఇచ్చింది. పురుషుడి అవయవంతో అమ్మాయి శరీరాన్ని ఎక్కడ తాకినా అది అత్యాచారం కిందకే వస్తుందని తేల్చింది. పోక్సో చట్టం కింద నమోదైన ఓ లైంగిక దాడి కేసుపై కేరళ హైకోర్టులో విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడు తాను సెక్స్ చేయలేదని.. కేవలం తన అంగంతో టచ్ చేశానని.. అది లైంగిక దాడికి కిందకు ఎలా వస్తుందంటూ కోర్టు ముందు వాదించాడు. అది కూడా అత్యాచారం కిందకే వస్తుందని కోర్టు తేల్చింది. కేరళ హైకోర్టు కుటుంబ పరంగా ఇస్తున్న తీర్పులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి.