Kashmiri man attempts to offer namaz inside Ayodhya Ram Mandir:  అయోధ్యలోని రామజన్మభూమి ఆలయ ప్రాంగణంలో శనివారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. ఆలయ భద్రతా వలయాన్ని దాటుకుని లోపలికి ప్రవేశించిన ఒక యువకుడు, మందిర దక్షిణ భాగంలోని సీతా రసోయి సమీపంలో నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. పటిష్టమైన భద్రత ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం అధికారులను విస్మయానికి గురిచేసింది.

Continues below advertisement

అదుపులోకి తీసుకున్న యువకుడిని కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన అబూ అహ్మద్ షేక్ గా పోలీసులు గుర్తించారు. అతను గేట్ నంబర్ D1 ద్వారా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. భద్రతా సిబ్బంది అతడిని నమాజ్ చేయకుండా అడ్డుకున్న సమయంలో, ఆ యువకుడు తన వర్గానికి అనుకూలంగా నినాదాలు చేస్తూ హంగామా సృష్టించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించాయి.   

ఈ ఘటనతో నిఘా వర్గాలు, స్థానిక పోలీసులు మరియు సీనియర్ పరిపాలనాధికారులు అప్రమత్తమయ్యారు. యువకుడి నేపథ్యం ఏమిటి? అతను ఒంటరిగానే వచ్చాడా లేక ఎవరి ప్రోద్బలంతోనైనా ఈ చర్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు లోతుగా విచారణ జరుపుతున్నాయి. అతని వద్ద ఉన్న పత్రాలను, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో రామమందిరం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.      

ఈ వ్యవహారంపై అయోధ్య జిల్లా యంత్రాంగం ,  రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతానికి అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆలయ పరిసరాల్లోని 15 కిలోమీటర్ల పరిధిలో మాంసాహార విక్రయాలు , డెలివరీలపై అధికారులు ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.