Lok Bhavan Siddaramaiah resignation letter: కర్ణాటక రాజకీయాల్లో  కీలక ఘట్టం చోటుచేసుకుంది. గత మూడు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో అగ్రనేతగా వెలుగొందుతున్న సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  గురువారం మధ్యాహ్నం  గవర్నర్ అధికారిక నివాసం  లోక్ భవన్ కు చేరుకున్న ఆయన, తన రాజీనామా లేఖను సమర్పించారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం నగరంలో అందుబాటులో లేనందున, సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి  కు అందజేశారు. ఈ సందర్భంగా తన క్యాబినెట్ సహచరులు,మద్దతుదారులతో కలిసి ఆయన రాజ్‌భవన్‌కు వచ్చారు.   

Continues below advertisement

 హైకమాండ్ ఆదేశమే శిరోధార్యం 

Continues below advertisement

రాజీనామా అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.  కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వహిస్తాను  అని ఆయన స్పష్టం చేశారు. మూడేళ్ల పాటు తన ప్రభుత్వానికి సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సిద్ధరామయ్య తన ప్రసంగంలో  పవర్ షేరింగ్ ఒప్పందాన్ని గౌరవిస్తున్నట్లు పరోక్షంగా సూచించారు. హైకమాండ్ ఏ బాధ్యత అప్పగించినా  నిర్వర్తిస్తానన్నారు.  

 డీకే శివకుమార్ పట్టాభిషేకం ఖాయం

సిద్ధరామయ్య రాజీనామాతో ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అంతకుముందు ఉదయం జరిగిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ లో సిద్ధరామయ్య స్వయంగా తన సహచరులకు ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం సభలో చర్చనీయాంశమైంది. మే 29   సాయంత్రం జరగబోయే కాంగ్రెస్ శాసనసభా పక్షం  సమావేశంలో శివకుమార్‌ను అధికారికంగా కొత్త నేతగా ఎన్నుకోనున్నారు.

 రాజకీయ వ్యూహం - రాజ్యసభ ఆఫర్ 

సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోంది. ఆయనకు రాజ్యసభ సీటుతో పాటు ఏఐసీసీలో కీలక పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే సిద్ధరామయ్య ఈ ప్రతిపాదనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య, తనదైన సోషల్ ఇంజనీరింగ్  ద్వారా కర్ణాటకలో చెరగని ముద్ర వేశారు. సిద్ధరామయ్య నిష్క్రమణతో కర్ణాటకకాంగ్రెస్‌లో ఒక అధ్యాయం ముగిసింది. డీకే శివకుమార్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పాలనలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో చూడాలి. రెండు రోజుల్లో శివకుమార్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు.