BC Nagesh On Hijab Case: 


తీర్పుని స్వాగతిస్తున్నాం: మంత్రి


హిజాబ్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతించారు కర్ణాటక పాఠశాల విద్యామంత్రి బీసీ నగేష్. విద్యా సంస్థల్లో హిజాబ్‌ ధరించటానికి మద్దతునిచ్చే కొన్ని సంస్థలు సమాజాన్ని రెండుగా చీల్చేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. "వాళ్లకు కావాల్సిందల్లా సమాజాన్ని ముక్కలు చేయడమే. అందుకోసం హిజాబ్‌ను అడ్డం పెట్టుకుంటున్నారు" అని మండిపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు తరవాత 
మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు బీసీ నగేష్. ప్రస్తుతం ఈ తీర్పుతో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు చెల్లుతాయన్న విషయం స్పష్టమైందని అన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో కర్ణాటక హైకోర్టు...విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించకూడదన్న ప్రభుత్వ ఆదేశాలను సమర్థించింది. "సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మహిళలు హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇది దృష్టిలో ఉంచుకుని తీర్పు ఇస్తారని మేము భావించాం. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు చెల్లుబాటు అవుతాయి" అని స్పష్టం చేశారు మంత్రి బీసీ నగేష్. తీర్పు తరవాత రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు
అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఉడుపి జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ ఎలాంటి దుమారం రేగకుండా పోలీసులు నిఘా ఉంచారు. 










సుప్రీం తీర్పు..


కర్ణాటక హిజాబ్​ వివాదంపై సుప్రీం కోర్టు ఎటూ తేల్చలేదు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇచ్చారు. హిజాబ్​పై కర్ణాటక ప్రభుత్వ నిషేధాన్ని కొనసాగించేలా ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని ప్రతిపాదించారు. మరోవైపు జస్టిస్ సుధాన్షు ధూలియా ఇందుకు భిన్నంగా తీర్పు రాశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కన బెడుతూ హిజాబ్ బ్యాన్​పై అపీళ్లను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది కేవలం ఛాయిస్ మాత్రమేనని, అంతకంటే ఎక్కువ లేదా తక్కువ కాదని జస్టిస్ సుధాన్షు ధూలియా అన్నారు. సుప్రీం న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు ఇవ్వడంతో ఈ వ్యవహారాన్ని త్రిసభ్య ధర్మాసనానికి లేదా విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి తీసుకోవాలి. కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిజాబ్ వివాదంపై రెండు వర్గాల విద్యార్థులు పోటాపోటీగా నిరససలు చేశారు. 
ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ ధరించి  రావడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ విద్యార్థులు కాషాయ కండువాలతో విద్యా సంస్థలకు హాజరుకావడంతో వివాదం రాజుకుంది. కర్ణాటక ఉడిపి జిల్లాలో ఓ ప్రభుత్వ కాలేజీలో మొదలైన ఈ వివాదం క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. 


Also Read: Chiru BJP : చిరంజీవికి నచ్చిన లీడర్ వాజ్‌పేయి - బీజేపీకి సంకేతాలు పంపినట్లేనా ?