Bajrang Dal Ban:
కాంగ్రెస్ యూటర్న్
కర్ణాటక కాంగ్రెస్ "భజ్‌రంగ్ దళ్"ని బ్యాన్ చేస్తామని హామీ ఇచ్చినప్పటి నుంచి ఆ వివాదం సద్దుమణగడం లేదు. అటు బీజేపీ ఇదే విషయాన్ని పొలిటికల్‌గా తమకు అనుకూలంగా మార్చేసుకుంది. యాంటీ హిందూ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ఓడించండి అంటూ ప్రచారం చేస్తోంది. ఇప్పటి వరకూ దీనిపై కాంగ్రెస్ స్పందించలేదు. కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. అయితే వివాదం ముదరడం వల్ల ఓ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. భజరంగ్ దళ్‌ను నిషేధించాలన్న ప్రతిపాదన ఏమీ లేదని తేల్చి చెప్పారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ వీరప్ప మొయిలీ ఈ స్పష్టతనిచ్చారు. ఉడుపిలో ప్రచారం చేస్తున్న వీరప్ప..ఈ కామెంట్స్ చేశారు. ఇది రాజకీయంగా బీజేపీకే బూస్ట్ ఇచ్చేలా ఉందని కాంగ్రెస్ ఇలా జాగ్రత్తపడింది. వీరప్ప మొయిలి ప్రకటనతో క్లారిటీ ఇచ్చింది.
"మా మేనిఫెస్టోలో PFIతో పాటు భజరంగ్ దళ్ పేర్లనూ ప్రస్తావించాం. నిజానికి మా టార్గెట్ ఇవి మాత్రమే కాదు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రతి సంస్థనూ కట్టడి చేయాలన్నదే మా ఉద్దేశం. అయినా ఓ సంస్థను నిషేధించడం రాష్ట్రం పరిధిలో ఉండదు. కర్ణాటక ప్రభుత్వం భజరంగ్ దళ్‌ను ఎప్పటికీ బ్యాన్ చేయలేదు. డీకే శివకుమార్ దీనిపై ఇంకా క్లారిటీ ఇస్తారు. విద్వేష రాజకీయాలు ఆపేయాలంటూ సుప్రీంకోర్టే స్పష్టం చేసింది. అందుకే మరోసారి చెబుతున్నాం. భజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయాలన్న ప్రపోజల్ ఏమీ లేదు. కాంగ్రెస్ నేతగా నేనీ ప్రకటన చేస్తున్నాను."
- వీరప్ప మొయిలి, కాంగ్రెస్ సీనియర్ నేత
బీజేపీ కౌంటర్ అటాక్..
భజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ హామీపై బీజేపీ ఇప్పటికే కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది కాషాయ పార్టీ. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఆలయంలో హనుమాన్ చాలీసా చదవనున్నట్టు ప్రకటించింది. ఇవాళ (మే 4వ తేదీ) సాయంత్రం 7 గంటలకు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ బీజేపీ కార్యకర్తలు హనుమాన్ చాలీసా చదవనున్నారు. గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ చాలీసా చదివేందుకు ప్లాన్ చేసుకుంటోంది ఆ పార్టీ. భజ్‌రంగ్ దళ్ బ్యాన్ హామీ పూర్తి స్థాయిలో పొలిటికల్‌గా వాడుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే హనుమాన్ చాలీసా అంశం తెరపైకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో కాంగ్రెస్‌కి యాంటీ హిందూ అనే ముద్ర పడేలా వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటి వరకూ కాంగ్రెస్ ఈ వివాదంపై స్పందించలేదు. కాంగ్రెస్ ఎలాంటి కౌంటర్ అటాక్‌తో ముందుకొస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అటు ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రతి సభలోనూ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు. భజ్‌రంగ్ దళ్ బ్యాన్ హామీపై నేరుగా స్పందించకపోయినా...తన ప్రసంగాన్ని భజ్‌రంగ్ బలి కీ జై అంటూ స్టార్ట్ చేశారు. అలా కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.