Karnataka New CM : కర్ణాటకలో ముఖ్యమంత్రి పేరుపై కొనసాగుతున్న గొడవకు ఇప్పుడు తెరపడింది. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరు ఖరారు కాగా, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ను ఎన్నుకోబోతున్నారు. మే 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులో వీరి ప్రమాణ స్వీకారం జరగనుంది.


మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యనే కర్ణాటక నూతన ముఖ్యమంత్రి అని ప్రకటించిన వెంటనే ఆయన నివాసం బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్ధరామయ్య పేరును సీఎంగా ప్రకటించడంతో ఆయన మద్దతుదారులలో కూడా ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తోంది. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో సిద్ధరామయ్య పోస్టర్లు, బ్యానర్లు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య మద్దతుదారులంతా సంబురాలు చేసుకుంటున్నారు. టపాసులు పేలుస్తూ.. మిఠాయిలు తినిపించుకుంటూ, సిద్ధరామయ్య బ్యానర్లకు పాలాభిషేకం చేస్తున్నారు. 






ప్రమాణ స్వీకారోత్సవానికి కొనసాగుతున్న ఏర్పాట్లు.. 


సిద్ధరామయ్య సొంత జిల్లా మైసూరులో  ఆయన స్వగ్రామం సిద్ధరామహుండిలో కూడా పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. ఆయన మద్దతుదారులు, శ్రేయోభలాషులు రోడ్లపై ఉన్న సిద్ధరామయ్య చిత్ర పటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. టపాసులు పేల్చి, నృత్యాలు చేసి, మిఠాయిలు పంచి పెడుతున్నారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా తమ నాయకుడు ప్రమాణస్వీకారం చేయడం పట్ల మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బెంగళూరులోని శ్రీకంఠీరవ స్టేడియంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు.


డీకే శివకుమార్ ఇంటి బయట కూడా భారీ బందోబస్తు


కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ నివాసం వెలుపల కూడా భద్రతా బలగాలను మోహరించారు. మే 20వ తేదీన ఉపముఖ్యమంత్రిగా శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.


ముందే చెప్పిన ఏబీపీ దేశం 


సిఎం రేసులో సిద్ధరామయ్య వాదన బలంగా ఉందని, తుది ఫలితం కూడా అదేనని ఏబీపీ దేశం రెండు రోజులు ముందే ధృవీకరించింది. ఈరోజు సాయంత్రం బెంగళూరులో జరగనున్న కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశం వరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 76 ఏళ్ల సిద్ధరామయ్య కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ అని పలుచుకునే డీకే శివకుమార్‌ను ఎలా పక్కకు నెట్టేసి సీఎం సీటును అధిష్టిస్తున్నారో ఓసారి చూద్దాం. 


ఎక్కువ మంది శాసనసభ్యుల మద్దతు


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అంటే మే 14వ తేదీ ఆదివారం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో తీర్మానం చేసి సీఎంను నిర్ణయించే హక్కు కాంగ్రెస్ అధ్యక్షుడికి కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కాంగ్రెస్ పరిశీలకులు తెలుసుకున్నారు. ఇందు కోసం రహస్య ఓటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సీక్రెట్ బ్యాలెట్ కు సిద్ధరామయ్య కూడా మద్దతిచ్చారని తెలుస్తోంది. మరుసటి రోజు అంటే సోమవారం ముగ్గురు కాంగ్రెస్ పరిశీలకులు ఢిల్లీ చేరుకుని మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని చెప్పారు. ఈ రహస్య ఓటింగ్ లో సిద్ధరామయ్యకు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చిందని సమాచారం.