Green Greenfield Highway: కడప తిరుపతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కడప- తిరుపతి గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేకి సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. రాజంపేట వద్ద ఈ హైవేకి సంబంధించిన పనులకు తొలి అడుగు పడింది. కడప నుంచి తిరుపతికి 4 లైన్ల రహదారి  2,200 కోట్లతో నిర్మాణం కానుంది. దీనికి సంబంధించిన క్లీన్ అండ్‌ గ్రబ్బింగ్‌ పనులను గ్రీన్ ఫీల్డ్‌ హైవే లైజనింగ్‌ ఆఫీసర్ హర్ష అభిరామ్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ పనులు పూర్తి అవ్వడానికి రెండు నెలల సమయం పడుతుంది. 


ఈ ప్రాజెక్టు పనులు మొత్తంగా రెండు ప్యాకేజీల కింద జరగనున్నాయి. మొదటి ప్యాకేజీ కడప నుంచి చిన్న ఓరంపాడు వరకు 64 కిలో మీటర్లు , రెండవ ప్యాకేజీ కింద రేణిగుంట 59 కిలో మీటర్ల వరకు జరగనుంది. ఈ హైవే నిర్మాణంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కడప నుంచి రేణిగుంట మధ్యలో 52 లైట్ వెహికల్ అండర్‌ పాస్‌ బ్రిడ్జిలు, 8 వెహికల్‌ అండర్‌ పాస్‌ లు, 72 మేజర్‌, మైనర్‌ బ్రిడ్జిలు, 240 కల్వర్టులు, 3 రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి లను నిర్మించనున్నారు.


ఈ హైవే పూర్తి అయితే కనుక కడప నుంచి తిరుపతి మధ్య దూరం తగ్గనుంది. ఎక్కువ మలుపులు లేకుండా రోడ్డు మార్గం తయారవుతుంది. ప్రస్తుతం ఉన్న మలుపుల రోడ్డు వలన ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోయారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే ప్రజల బాధలు కొంచెం తీరినట్లేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హైవే పూర్తి అయితే అటు బెంగళూరు నుంచి కానీ, ఇటు హైదరాబాద్‌ నుంచి కానీ తిరుపతి వచ్చే వారికి మార్గం సుగమం అవుతుంది.