Joshimath Crisis:


ఇస్రో ఇమేజ్‌ల సంచలనం..


జోషిమఠ్‌లోని స్థితిగతులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఆ ఊరు ఊరే త్వరలోనే కుంగిపోతుందని ఇటీవలే ISRO తేల్చి చెప్పింది. శాటిలైట్ ఇమేజెస్‌తో సహా వివరించింది. దీనిపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే National Disaster Management Authorityతో పాటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇస్రోతో పాటు రాష్ట్రానికి చెందిన ఏ సంస్థైనా...ఈ విషయమై మీడియాతో మాట్లాడకూడదని తేల్చి చెప్పింది. ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకూడదని ఆదేశించింది. జోషిమఠ్ పరిస్థితులపై సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్ట్‌లు పెట్టకూడదని తెలిపింది. అనుమతి లేకుండా వివరాలు పంచుకోవద్దని పేర్కొంది. గత వారం ఇస్రో జోషిమఠ్ పరిస్థితులకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వెలువరించింది. గతేడాది డిసెంబర్ 7వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 8 మధ్య కాలంలో జోషిమఠ్ 5.4 సెంటీమీటర్ల మేర కుంగిపోయిందని వివరించింది. అయితే...దీనిపై ఉత్తరాఖండ్ మంత్రి ధన్‌సింగ్ రావత్ అసహనం వ్యక్తం చేశారు. ఇస్రో విడుదల చేసిన చిత్రాలను "విత్‌డ్రా" చేసుకున్నట్టు వెల్లడించారు. ఆ తరవాతే "మీడియాతో" మాట్లాడొద్దన్న ఆదేశాలు వచ్చాయి. జోషిమఠ్‌ పనుల్లో పాలు పంచుకుంటున్న వాళ్లు కూడా మీడియాకు ఎలాంటి వివరాలు ఇవ్వకూడదని తేల్చి చెప్పారు అధికారులు. ఈ ఆర్డర్‌పై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. ఇలాంటి ఆదేశాలతో అందరి గొంతు నొక్కేస్తున్నారని విమర్శిస్తున్నాయి. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. "జోషిమఠ్‌లో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా చేసే ప్రయత్నమిది" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.