Jharkhand Train Accident:


ఝార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ధన్‌బాద్ డివిజన్‌లోని కొదెర్మా వద్ద బొగ్గు గూడ్స్ ట్రైన్ బోగీలు ఉన్నట్టుండి విడిపోయాయి. ఉదయం 6.24 నిముషాలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ట్రైన్‌లో బొగ్గు తరలిస్తున్నారు. 50కిపైగా వాగన్స్‌ ఉన్నాయి. అయితే...ఉన్నట్టుండి అవి విడిపోవటం వల్ల అదుపు తప్పి పడిపోయాయి. ఫలితంగా..ఈ వ్యాగన్స్‌ పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని చెల్లాచెదురయ్యాయి. ఒక వ్యాగన్‌పై మరో వ్యాగన్‌ పడిపోయింది. బ్రేక్ ఫెయిల్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేలింది. గుర్పా స్టేషన్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ కారణంగా...గయా-ధన్‌బాద్ మధ్య ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. లోకోపైలట్, గార్డ్ సురక్షితంగా బయట పడ్డారు. రైల్వే లైన్‌పై వ్యాగన్స్‌ చెల్లాచెదురయ్యాయి. పెద్ద శబ్దం రావటం వల్ల స్థానికులు రైల్వే లైన్‌ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ట్రాక్షన్ పోల్స్, వైర్స్‌ పూర్తిగా ధ్వంసమయ్యాయి.