Jayam Ravi divorce : తమిళ నటుడు జయం రవి నలభై లక్షల భరణం ఇస్తే విడాకులకు అంగీకరిస్తానని అతని భార్య ఆర్తి కోర్టుకు చెప్పారు. 2009లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట, 15 ఏళ్ల సంసార జీవితం తర్వాత 2024 సెప్టెంబర్‌లో విడాకులు ప్రకటించారు. వీరికి ఆరవ్ , అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదట జయం రవి ఈ విడాకుల ప్రకటన చేశారు. అప్పట్నుంచి అనేక వివాదాలు, ఆరోపణలు, సోషల్ మీడియా చర్చలు నడుస్తున్నాయి.
జయం రవి చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. 2024 నవంబర్ 15న జరిగిన విచారణలో జయం రవి కోర్టుకు హాజరు కాగా, ఆర్తి వీడియో కాల్ ద్వారా పాల్గొన్నారు. కోర్టు ఇరువుర్గాల వాదనలు విని, రాజీ కోసం ప్రయత్నించాలని, విడాకులకు స్పష్టమైన కారణాలు తెలపాలని సూచించింది. ఆర్తి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, జయం రవి నుండి నెలకు 40 లక్షల రూపాయల భరణం కోరింది. ఈ భరణం తన ఇద్దరు కుమారుల శ్రేయస్సు కోసమని ఆర్తి పేర్కొన్నారు.
2024 సెప్టెంబర్ 9న, జయం రవి సోషల్ మీడియా ద్వారా తాము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఎన్నో చర్చల తర్వాత తీసుకున్నట్లు చెప్పారు. కానీ జయం రవి భార్య మాత్రం తనకు తెలియకుండానే, తన అనుమతి లేకుండా జయం రవి ఈ ప్రకటన చేశారని ఆరోపించారు. ఈ ఏకపక్ష నిర్ణయంతో తాను, తన పిల్లలు షాక్‌కు గురయ్యామని, ఈ ప్రకటన తన గౌరవాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్తి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను "ఆర్తి రవి"గానే కొనసాగిస్తానని, విడాకులు అధికారికంగా మంజూరు అయ్యే వరకు తాను జయం రవి భార్యగానే ఉంటానని పేర్కొన్నారు.
జయం రవి బెంగళూరుకు చెందిన గాయని కెనీషా ఫ్రాన్సిస్‌తో రిలేషన్ లో ఉన్నారు. జయం రవి కెనీషాతో పబ్లిక్ ఈవెంట్‌లకు వెళ్తున్నారు. వీరి వ్యవహారం సోషల్ మీడియాలో ఈ విడాకుల విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది జయం రవి అడయార్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆర్తి తనను ఇంటి నుండి గెంటివేసిందని, తన వస్తువులను తిరిగి ఇప్పించాలని కోరారు . ఈ వివాదం అలా కొనసాగుతోంది. విడాకులు మంజూరుకు జయం రవి భారీగా భరణం చెల్లించాల్సి వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.