JK assembly 1st Phase election : మూడు దశల్లో జరగనున్న జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్‌ బుధవారం (సెప్టెంబర్‌ 18)న ప్రారంభమైంది. పదేళ్లుగా జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు జరగలేదు. 2109లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు సహా జమ్ము కశ్మిర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎన్నికల సంఘం పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. బుధవారం నాటి తొలి దశలో ఈ యూనియన్‌ టెరిటరీలోని 24 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్ము కశ్మీర్‌ను యూనియన్ టెరిటరీగా మార్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కూడా ఇవే కావడం విశేషం. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా.. జమ్ము కశ్మీర్‌ పరిధిలోని ఫిర్‌ పంజాల్‌ పర్వత శ్రేణులకు సమీపంలో ఉండే 7 జిల్లాల పరిధిలో ఈ తొలి దశ జరుగుతోంది. మొత్తం 23 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా.. 90 మంది ఇండిపెండెంట్లు సహా 219 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.


తొలి దశలో జమ్ము నుంచి 8, కశ్మీర్‌ లోయలో 16 స్థానాలకు ఎన్నికలు:


తొలి దశ పోలింగ్‌లో జమ్ము పరిధిలోని మూడు జిల్లాల్లోని 8 స్థానాలకు కశ్మీర్‌ లోయలో నాలుగు జిల్లాల పరిధిలోని 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం తొలి దశలో  మొత్తం ఓటర్లు 23 లక్షలా 27 వేల 580 మంది కాగా వీరిలో.. 11 లక్షలా 74 వేల 462 మంది పురుష ఓటర్లు.. మరో 11 లక్షలా 51 వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో 60 మంది థర్జ్‌ జెండర్ ఓటర్లున్నారు. ఈ మొత్తంలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సు వారు లక్షా 23 వేల మంది. ఈ ఎన్నికల కోసం  3 వేల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయగా.. 14 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. వీటిలో 302 అర్బన్ పోలింగ్‌ బూత్‌లు కాగా మిగిలినవి గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పారామిలటరీ ఫోర్సెస్ , జమ్ము కశ్మీర్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌, జమ్ము కశ్మీర్ పోలీసుల సాయంతో వివిధ అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.


సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 90 స్థానాలున్న జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ సెప్టెంబర్ 25న జరగనుండగా.. ఆ రోజు 26 స్థానాలకు.. ముడో దశ పోలింగ్ అక్టోబర్ 1న జరగనుండగా.. 40 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఫలితాలు అక్టోబర్‌ 8న వెల్లడి కానున్నాయి. కాంగ్రెస్ , నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కూటమిగా ఈ ఎన్నికలను ఎదుర్కొంటుండగా.. భారతీయ జనతా పార్టీ, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్‌తో పాటు మరి కొన్ని పార్టీలు ఏ పార్టీలతో కలవకుండా నేరుగా బరిలో నిలిచాయి. అన్ని పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ ఎత్తున ఓటర్లు బారులు తీరినట్లు అధికారులు తెలిపారు. క్రిష్టావర్ జిల్లాలో మహిళలు జాతీయ భద్రత, సామాజిక భద్రత, రిలీజియస్ సెక్యూరిటీ ఆధారంగా తాము పోటీలో నిలిచిన క్యాండిడేట్లకు ఓట్లు వేస్తున్నట్లు తెలిపారు.


రికార్డులు బద్దలకొట్టాలని మోదీ పిలుపు


జమ్మూకశ్మీర్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. "జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రారంభమైనందున, ఈ రోజు పోలింగ్‌కు జరిగే నియోజకవర్గాల్లోని వారందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నాను. ప్రత్యేకించి యువకులు, మొదటిసారి ఓటు వేసే వాళ్లు కదలి రావాలని పిలుపునిస్తున్నాను." అని మోడీ X లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.