Jail for going to an uninvited wedding to eat: పిలవని పేరంటానికి వెళ్లి వడ్డించని విందు ఆరగించే బ్యాచ్‌కు కాలం చెల్లిపోయింది. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. కొత్త బట్టలు వేసుకుని, అద్దం ముందు నీటుగా తయారై, ఏ ఫంక్షన్ హాల్ కనిపిస్తే అక్కడికి వెళ్లి  మర్యాద రామన్న ల్లా భోజనం చేసి వచ్చే వారికోసం ఇప్పుడు గట్టి  సెక్షన్లే  అమలవుతున్నాయి. అశోక్ నందన గార్డెన్ యాజమాన్యం పెట్టిన ఈ బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తూనే, విందుభోజనాలను పిలవకుండానే తినేసేవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

Continues below advertisement

మన తెలుగు సినిమాల్లో ఇలా పిలవని పేరంటాలకు వెళ్లే సీన్లు చాలానే ఉన్నాయి.   తన గ్యాంగ్‌తో కలిసి ఒక తెలియని పెళ్లికి వెళ్లి.. అక్కడ ఐస్క్రీమ్ పార్లర్ దగ్గర వరుస కట్టి మరీ లాగించే గ్యాంగులు ఉంటాయి.  ఎవరైనా అడిగితే పెళ్లి కొడుకు తరపు అని చెప్పండి అనే చిట్కాతో పని కానిచ్చేస్తుంటారు.  ఇవి కేవలం కామెడీ సీన్లు మాత్రమే.. కానీ ఇప్పుడు అలాంటి పనులు చేస్తే నిజంగానే జైలు సీన్లు చూడాల్సి వస్తుందని   బోర్డులు హెచ్చరిస్తున్నాయి.  

ఫంక్షన్ హాల్ ముందు ఉన్న  బోర్డు మీద ఉన్న సెక్షన్ 441 అనేది క్రిమినల్ ట్రెస్పాస్  అంటే అక్రమ ప్రవేశం  గురించి చెబుతుంది. అంటే, యజమాని అనుమతి లేకుండా ఒక ప్రదేశంలోకి ప్రవేశించడం నేరం. ఆ సెక్షన్ ప్రకారం 3 నెలల జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా ఉంటుందని యాజమాన్యం సీరియస్‌గా బోర్డు పెట్టేసింది. అంటే, అక్కడ తిన్న ప్లేటు భోజనం ఖరీదు రూ. 500 అనుకుంటే.. దానికి పది రెట్లు ఫైన్ కట్టాలన్నమాట! ఒకవేళ దొరికిపోతే, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే.. విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం దొరికిపోయి పడ్డ కష్టాల కంటే దారుణంగా ఉండేలా ఉంది.

Continues below advertisement

నిజానికి ఇదంతా చూస్తుంటే భోజనం మీద ఉన్న ప్రేమ కంటే, ఫంక్షన్ హాల్ యజమానులకు ఉన్న కోపం ఎక్కువగా కనిపిస్తోంది. పిలవని పేరంటాలకు వచ్చే వాళ్ళ వల్ల ఒక్కోసారి భోజనం సరిపోక పెళ్లి వారు ఇబ్బంది పడుతుంటారు. ఆ బాధ తట్టుకోలేకే ఇలాంటి  న్యాయపరమైన హెచ్చరికలు తెరపైకి తెచ్చారు. బహుశా రేపు పొద్దున ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్‌లో ఆధార్ కార్డు లేదా ఇన్విటేషన్ కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే లోపలికి పంపే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీఐపీల పెళ్లిళ్లకు ఇప్పటికే ఇది అమలు చేస్తున్నారు. 

 ఇకపై తెలియని పెళ్లిళ్లకు వెళ్లి "ఏవండీ.. పెళ్లి కొడుకు మా చుట్టమే!" అని చెప్పి లోపలికి వెళ్లాలనుకునే వారు ఒక్క నిమిషం ఈ బోర్డును గుర్తు తెచ్చుకోవడం మంచిది. లేదంటే తిన్న భోజనం అరగకముందే.. పోలీస్ స్టేషన్లో  క్రిమినల్ ట్రెస్‌పాస్  కేసుతో విందు ఆరగించాల్సి వస్తుంది.  జైలు భోజనం కంటే పెళ్లి భోజనం మేలు అనుకున్నావు కదరా?  అని మన వెనుక ఉన్న వాళ్ళు కామెడీ చేసే ప్రమాదం పొంచి ఉంది!