IT Stocks 2022: గత ఐదు సంవత్సరాల్లో నిఫ్టీ IT ఇండెక్స్ దాదాపు 4 రెట్లు పెరిగింది. 2022లో ఈ విన్నింగ్‌ స్పెల్‌కు బ్రేక్ పడింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత, మళ్లీ ఇప్పుడు, పరమ చెత్త పనితీరుతో 2022ని టెక్ స్టాక్స్‌ ముగిస్తున్నాయి.


గత రెండేళ్లు బ్రహ్మరథం 
గత రెండు సంవత్సరాలు 2020, 2021లో నిఫ్టీ ITకి అత్యుత్తమ కాలంగా ఉంది. ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్‌కు బ్రహ్మరథం పట్టారు. ఆ సంవత్సరాల్లో IT ఇండెక్స్ వరుసగా 54.9%, 59.6% ర్యాలీ చేసింది. 2022లో బలహీనపడిన ప్రపంచ పరిస్థితుల కారణంగా IT కంపెనీల మార్జిన్లు, గ్రోత్ ఔట్‌లుక్ చుట్టూ ఆందోళనలు నెలకొన్నాయి. దాని వల్లే, IT స్టాక్స్‌ చరిత్రలో మరో చెత్త సంవత్సరంగా 2022 నిలిచిపోతోంది.


44 శాతం పైగా పతనం
విరుచుకుపడే అల పడవలన్నింటినీ ముంచేసినట్లు, 2022లో ఏర్పడిన కఠిన పరిస్థితులన్నీ కలిసి ఐటీ స్టాక్స్‌ను ముంచేశాయి. మహామహా IT కంపెనీలకూ ఈ ఏడాది గ్రహపాటు తప్పలేదు. విప్రో, టెక్ మహీంద్రా, ఎంఫసిస్, LTI మైండ్‌ ట్రీ కౌంటర్లు తమ మార్కెట్ విలువలో 40% పైగా నష్టపోయాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి నిఫ్టీ ఐటి కూడా దాదాపు 24% క్షీణించింది. పరమ పేలవ రంగంగా మారింది.


ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (15 డిసెంబర్‌ 2022)... విప్రో −44.4%, టెక్‌ మహీంద్ర −41.6%, ఎంఫసిస్‌ −41.45%, LTI మైండ్‌ ట్రీ −41.11%, కోఫోర్జ్‌ −33.47%, L&T టెక్నాలజీ సర్వీసెస్‌ −30.25%, HCL టెక్నాలజీస్‌ −20.8%, పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ −16.82%, ఇన్ఫోసిస్ −16.72%, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) −10.87% పడిపోయాయి.


2008, 2004లో మార్కెట్ క్రాష్‌లు కూడా ఈ రంగానికి అధ్వాన్నంగా మారాయి. ఆ సంవత్సరాల్లో IT బారోమీటర్ వరుసగా 87.5%, 54.6% వద్ద క్రాష్ అయింది. 2011లో - 18%, 2016లో -7.6% నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ క్షీణించింది. 


2023లో ఐటీ స్టాక్స్‌ పుంజుకుంటాయా?
US, యూరప్‌ను మాంద్యం ముంచెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఈ దేశాలతో అనుసంధానంగా ఉన్న IT కంపెనీలన్నీ ప్రభావితం అవుతాయని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. IT కంపెనీల ఆదాయాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. కాబట్టి, 2023 గురించి పెట్టుబడిదారులు భయపడుతున్నారు.


గత చరిత్రను గమనిస్తే... US/ యూరోప్‌ మందగమనంలోకి వెళ్లిన ప్రతిసారీ, స్థిర కరెన్సీ (constant currency -CC) వృద్ధి, IT రంగానికి సంబంధించిన వాల్యుయేషన్లు 20- 60% వరకు తగ్గాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.