India and Pakistan War : ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఖాయమన్నట్లుగా ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడం  ఖాయం కావడంతో పాకిస్తాన్ కూడా తాము ఎదురుదాడి చేస్తామని రెడీ అయిపోయింది. పాకిస్తాన్  సైన్యం ఉగ్రవాదులతో చేయించిన దాడి కారణంగా ఇప్పుడు ప్రపంచం ముంగిటకు మరో యుద్ధం ముంచుకు  వచ్చేసింది. 

కొన్నాళ్లుగా భారత్, పాక్ మధ్య సంబంధాలు గొప్పగా లేనప్పటికీ ఉద్రిక్తతలు అయితే లేవు. కశ్మీర్ లో ఉగ్రదాడులు కూడా తగ్గిపోయాయి. పాకిస్తాన్ కూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి, తాలిబన్ల నుంచి కూడా ముప్పు రావడంతో వారి నుంచి కాపాడుకోవడానికి తమ తంటాలు తాము పడాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో  ఇండియాను రెచ్చగొట్టి మరో వైపు నుంచి  ముప్పు తెచ్చుకునే పరిస్థితిని పాక్  తెచ్చుకోవాల్సిన  అవసరం లేదు. కానీ  పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్.. చేతికి అంటిన దాన్ని ముక్కుకు  అంటించుకునే రకం కావడంతో భారత్  ను రెచ్చగొట్టారు.                      

పిడికెడు మంది తాలిబన్లు దాడి చేస్తేనే పాకిస్తాన్ సైన్యం తట్టుకోలేకపోయింది. తిప్పికొట్టడానికి ఇబ్బంది పడింది. ఇప్పుడు అత్యాధునిక ఆయుధాలతో భారత్ దాడి చేస్తే పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుంది. ఉక్రెయిన్  పై రష్యా దాడి చేసింది. ఉక్రెయిన్  కు ప్రపంచం మద్దతు ఇచ్చింది. అమెరికా, యూరప్ దేశాలు ఆయుధాలు ఇచ్చాయి. కానీ భారత్, పాక్ మధ్య యుద్ధం వస్తే పాకిస్తాన్ కు ఎవరూ సాయం చేయరు. చైనా  కూడా బహిరంగంగా సాయం చేయడానికి వెనుకడుగు వేస్తుంది. ఎంత సాయం చేసినా చైనా  ఊరకనే  చేయలేదు. దానికి తగ్గట్లుగా ఆస్తులు రాయించుకుంటుంది. అప్పులు కుప్ప నెత్తి మీద పెడుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ .. చైనాకు పూర్తిగా రుణపడిపోయింది. 

ఇప్పుడు భారత్ దాడి చేస్తే.. తాము ఎదురు దాడి చేయకపోతే పరువుపోతుందన్న  ఉద్దేశంలో పాకిస్తాన్ తాము కూడా యుద్ధ సన్నాహాలను చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ యుద్ధం అంటూ వస్తే  తమ ఆర్మీ దుస్థితికి పరువు పోతుందని వారికి తెలుసు. అసలే రాజకీయ అనిశ్చితి.. దానికి తోడు ఆర్మీపై ప్రజల్లో ఉన్న  వ్యతిరేకత కలిపి..యుద్ధం అంటూ వస్తే.. పాకిస్తాన్ తీవ్ర సమస్యల్లో ఇరుక్కుంటుంది. ఇప్పటికీ పాకిస్తాన్ ప్రజలు కనీస అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్నారు. ఇలాంటి సమయంలో యుద్ధం అంటే.. మరిన్నికష్టాలు పడుతున్నారు. గతంలోలా పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు భారత్ అంటే వ్యతిరేకించడం లేదు. కేవలం అక్కడి ఆర్మీ.. రాజకీయ నేతలు తమ పబ్బం గడుపుకోవడానికి.. దేశాన్ని భ్రష్టుపట్టించినా.. పట్టించుకోకుండా భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని అనుమానిస్తున్నారు.

భారత్ నేరుగా పాకిస్తాన్ పై యుద్ధం  ప్రకటించదు. కానీ పాకిస్తాన్ భూభాగంలో  దాగి ఉన్న టెర్రరిస్టులను మాత్రం వదిలి పెట్టే అవకాశం లేదు. అప్పుడు పాకిస్తాన్ ఆ టెర్రరిస్టులకు మద్దతుగా యుద్ధం ప్రారంభిస్తే.. అప్పుడు అసలు కథ ప్రారంభమవుతుంది.