Conjoined Twins in Saudi Arabia:


27 మంది వైద్యుల శ్రమ..


ఇరాక్‌కు చెందిన ఇద్దరు అవిభక్త కవలలకు అరుదైన సర్జరీ చేసి వేరు చేశారు వైద్యులు. దాదాపు 11 గంటల పాటు 27 మంది వైద్యులు శ్రమించి ఈ సర్జరీని విజయవంతం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. స్పెషలిస్ట్‌లు, నర్సులు, టెక్నికల్ స్టాఫ్..ఇలా అంత మంది కష్టపడితే కానీ ఆ సర్జరీ పూర్తి కాలేదు. ఈ ఇద్దరు చిన్నారుల కాలేయం, పొత్తి కడుపు అతుక్కునిపోయాయి. చాలా సున్నితమైన సర్జరీని...కింగ్ సాల్మన్ ఆదేశాలతో పూర్తి చేశారు వైద్యులు. Saudi Conjoined Twins Programలో భాగంగా సౌదీ అరేబియాలో ఇలాంటి సర్జరీలు చేస్తుంటారు. ఇప్పటికే 23 దేశాలకు చెందిన 127 మంది అవిభక్త కవలల్ని విడదీశారు. 32 ఏళ్లుగా ఈ సేవలందిస్తున్నారు. ప్రస్తుతానికి ఇద్దరు చిన్నారులూ ఆరోగ్యంగా ఉన్నారు. కింగ్ అబ్దుల్లా స్పెషలైజ్డ్ ఆసుపత్రిలో దాదాపు ఆరు దశలుగా ఈ సర్జరీ చేశారు. అయితే ఈ సర్జరీని నేతృత్వం వహించిన వైద్యుడు కీలక విషయం వెల్లడించారు. ఆపరేషన్ 70% మాత్రమే సక్సెస్ అయిందని చెప్పారు. చాలా వరకు అవయవాలు అతుక్కుపోయాయని అన్నారు. ఈ సర్జరీని పూర్తి చేసిన వైద్యులకు థాంక్స్ చెప్పారు. హెల్త్ సెక్టార్‌లో అభివృద్ధి సాధిస్తున్నామనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈ కవలలను సౌదీకి తీసుకొచ్చారు.