Raptadu Incident Encounter Demand:  సమాజంలో ఘోరమైన అపరాధాలు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై  వికృత దాడులు జరిగిన ప్రతిసారీ ప్రజాక్షేత్రం నుంచి ఒక్కటే  నినాదం వినిపిస్తోంది— నిందితుడిని అప్పటికప్పుడు ఎన్‌కౌంటర్ చేయాల్సిందే! అని.   న్యాయస్థానాల విచారణ, తీర్పుల కోసం వేచి చూసే ఓపిక ప్రజల్లో రోజురోజుకూ సన్నగిల్లుతోంది. గతంలో సంచలనం సృష్టించిన  దిశ  ఉదంతంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినప్పుడు ప్రజల నుంచి, పౌర సమాజం నుంచి వెల్లువెత్తిన అభినందనలు, మద్దతు ఈ ధోరణికి నిదర్శనం. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన దారుణ సంఘటన అనంతర పరిణామాలలోనూ నిందితులపై తీవ్ర ప్రజాక్షోభ, తక్షణ శిక్ష విధించాలన్న డిమాండ్లు ఇవే సంకేతాలను ఇస్తున్నాయి. అయితే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ  తక్షణ న్యాయం సంస్కృతి ఎటు దారితీస్తోందనేది  ఆలోచనాత్మకమైన ప్రశ్న.

Continues below advertisement

 ఎన్‌కౌంటర్ మద్దతు ధోరణి ఎందుకు?

ఈ తరహా ఎన్‌కౌంటర్ మద్దతు ధోరణి ఎందుకు పెరుగుతోందో లోతుగా విశ్లేషిస్తే, ప్రధానంగా మన న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకరాహిత్యమే అసలు కారణమని స్పష్టమవుతోంది. దశాబ్దాలుగా నడిచే సివిల్, క్రిమినల్ విచారణలు, సాక్ష్యాల కొరత సాకుతో దర్జాగా బయటపడే నిందితులు, బెయిలుపై బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడే సంస్కృతి.. సామాన్యుడికి న్యాయవ్యవస్థపై విసుగు పుట్టిస్తోంది.  శిక్ష ఆలస్యమైతే అది న్యాయాన్ని నిరాకరించడమే  అనే భావన బలంగా నాటుకపోవడం వల్లనే, పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని  ఆత్మరక్షణ, ఎదురుదాడి  పేరిట మరణశిక్షలు అమలు చేసినప్పుడు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ జైజైలు పలుకుతున్నారు.

Continues below advertisement

కానీ అది అరాచకానికి దారి తీస్తుంది!

 ఎంతటి దారుణ నేరమైనా సరే, న్యాయ విచారణను దాటవేసి పోలీసులు శిక్షకులుగా మారడం ప్రజాస్వామ్య సూత్రాలకే పెద్ద ముప్పు. పోలీసు వ్యవస్థే తప్పును నిర్ధారించి, శిక్షను నిర్ణయించి, దానిని వెంటనే అమలు చేసే అధికారాన్ని పొందితే.. రాజ్యాంగం ప్రసాదించిన చట్టబద్ధమైన పాలన  అనే పునాది కూలిపోతుంది. ఆత్మరక్షణ లేదా ఎదురుదాడి ముసుగులో జరిగే ఎన్‌కౌంటర్లు చట్టబద్ధమైన న్యాయ విచారణకు ప్రత్యామ్నాయం కావు. ఉద్వేగాల ఆధారంగా న్యాయం జరిగే వాతావరణం ఏర్పడితే, రేపు నిర్దోషులు లేదా రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ  తక్షణ న్యాయం  పేరిట బలికావాల్సి వస్తుంది.

ఇలాంటి ఘటనలు అరాచకానికి దారి తీస్తాయి!

పోలీసులు న్యాయమూర్తులుగా మారిపోవడం అనేది అరాచకత్వానికి  దారితీస్తుంది. ఒక పోలీస్ రాజ్యం రూపుదిద్దుకుంటే పౌరుల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ ప్రమాదంలో పడతాయి. ఎన్‌కౌంటర్లను ఆమోదించే సమాజం, అంతర్గతంగా తమ న్యాయపరిపాలన వ్యవస్థ విఫలమైందని ఒప్పుకున్నట్లే. రాప్తాడు వంటి ఘటనల్లో ప్రజల ఆగ్రహం న్యాయమైనదే అయినప్పటికీ, ఆ ఆగ్రహాన్ని ఎన్‌కౌంటర్ల దాహంగా మార్చడం కాకుండా చట్టపరమైన సంస్కరణలకు ఆయుధంగా మలచుకోవాల్సిన బాధ్యత సమాజంపైన, పాలకులపైన ఉంది.  ప్రజలు ఎన్‌కౌంటర్లను కోరుకోవడం వెనుక ఉన్న అసలు సందేశం మాకు తక్షణ, కఠినమైన న్యాయం కావాలి  అని మాత్రమే. ఈ పరిస్థితిని మార్చాలంటే శిక్షాస్మృతి, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో విప్లవాత్మకమైన మార్పులు రావాలి. దారుణమైన నేరాల్లో వేగంగా  విచారణ పూర్తి చేసి, నెలల వ్యవధిలోనే శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థలను బలోపేతం చేయాలి. సాక్ష్యాల సేకరణలో సాంకేతికతను పెంచి, లూప్‌హోల్స్ లేకుండా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేసినప్పుడే ప్రజలకు నమ్మకం కుదురుతుంది.

భావోద్వేగంతోనే ఎన్ కౌంటర్లు

 ఎన్‌కౌంటర్లు తాత్కాలికంగా ప్రజామోదాన్ని, భావోద్వేగ ఉపశమనాన్ని ఇవ్వవచ్చు కానీ, అవి సమాజానికి ఆరోగ్యకరమైన పరిష్కారాలు కావు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఎప్పటికీ సమర్థనీయం కాదు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయస్థానాల ద్వారానే నిందితులకు కఠిన శిక్షలు పడాలి.