IndiGo Flight Declared Mayday Due To Low Fuel : మేడే కాల్ అంటే చాలు విమాన ప్రయాణికులు ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి. అహ్మదాబాద్ ఫ్లైట్ లో అలాగే మేడే కాల్ ఇచ్చారు. క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. అలాంటి పరిస్థితే మరో ఇండిగో విమానానికి వచ్చింది. ఇంధనం తక్కువగా ఉండటం వల్ల ఇండిగో విమానం 'మేడే'గా ప్రకటించారు.
గౌహతి-చెన్నై మధ్య తిరిగే ఇండిగో విమానం 168 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే గమ్యస్థానం చెన్నైకు చేరే వరకూ సరిపడా ఇంధనం లేదు. దాంతో "తగినంత ఇంధనం లేకపోవడం" కారణంగా పైలట్లు 'మేడే' కాల్ ను బెంగళూరు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఇచ్చారు. అక్కడ సేఫ్ ల్యాండింగ్ కు అనుమతి తీసుకున్నారు. బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఇంధనం చాలా తక్కువగా ఉన్న స్థితిలో ఇండిగో విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ అయింది. చెన్నై విమానాశ్రయంలో రద్దీ కారణంగా ఈ మళ్లింపు జరిగిందని, దీనివల్ల విమానం సకాలంలో అక్కడ దిగలేకపోయిందని వర్గాలు తెలిపాయి.
గౌహతి నుండి సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరిన 6E-6764 (A321) పైలట్ 7:45 గంటలకు చెన్నైలో ల్యాండ్ కావడానికి ప్రయత్నించాడు. కానీ అనుమతి రాలేదు. దాంతో "చుట్టూ తిరగాలని" నిర్ణయించుకున్నాడు. కానీ తగినంత ఫ్యూయల్ లేదు.
మేడే కాల్ అందిన తర్వాత, ATC (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) సిబ్బందిని అప్రమత్తం చేసింది. వారు వెంటనే ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారు. వైద్య, అగ్నిమాపక సేవల సిబ్బందిని రెడీగా ఉంచారు. అయితే ఎలాంటి ప్రమాదం లేకుండా రాత్రి 8:20 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన రెండు రోజుల కిందట జరిగినట్లుగా తెలుస్తోంది.
శుక్రవారం, మధురైకి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది . చెన్నైకి తిరిగి వెళ్లి ల్యాండ్ అవ్వడానికి అనుమతి కోరినట్లు వర్గాలు తెలిపాయి. దాదాపు 68 మంది ప్రయాణికులతో కూడిన విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది .
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమానాల్లో డబుల్ చెకింగ్ లు చేస్తున్నారు. ఫలితంగా ఎన్నో లోపాలు బయటపడుతున్నాయి. సాంకేతిక లోపాలతో కొన్ని విమానాలు ఆలస్యమవుతున్నాయి. అయితే ఎక్కువగా సిబ్బంది తప్పిదాల వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా విమానంలో ఫ్యూయల్ అవసరానికిమించి ఎక్కువగా ఉంచుకుంటారు. కానీ గౌహతి - చెన్నై ఫ్లైట్ లో పరిమితంగా ఉండటంతో నిర్లక్ష్యం స్పష్టంగా బట్టబయలు అయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.