Indian Railways: సామాన్య మధ్య తరగతి ప్రజల కోసం భారతీయ రైల్వే కొత్త నాన్ ఏసీ రైలును అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను పెంచిన తర్వాత... భారతీయ రైల్వే అదే తరహాలో ఉండే సెకండ్ క్లాస్ అన్‌రిజర్వ్‌డ్, సెకండ్ క్లాస్ 3-టైర్ స్లీపర్ కోచ్‌లతో కొత్త రైలును తయారు చేయాలని భావిస్తోంది. కొత్త రైలు పేరు ఇంకా నిర్ణయించ లేదు. కానీ సామాన్యులకు కోసం అన్ని వసతులు, మెరుగైన ప్రయాణ అనుభవం ఉన్న రైలును తయారు చేయాలనే ఆలోచన చేస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో కొత్త రైలులో కొన్ని ఫీచర్లు ఉంటాయని ఓ అధికారి తెలిపారు. అయితే వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్వయం చోదక రైలులా కాకుండా.. ఆధునిక రైలు లోకో హాలింగ్ చేయనున్నారు.
పుష్-పుల్ టెక్నాలజీతో నడుస్తున్న రైళ్లు
భారతీయ రైల్వేలోని అనేక రైళ్లు లోకోమోటివ్ ద్వారా నడుస్తున్నాయి. దీనికి రెండు చివర్లలో లోకో మోటివ్‌లు ఉంటాయి. ముఖ్యంగా ప్రతీ చివర లోకో మోటివ్‌తో.. రైలు వేగంగా కదిలేందుకు పుష్-పుల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. ఇది చివరి స్టేషన్‌లో లోకో మోటివ్ రివర్సల్ అవసరాన్ని కూడా తొలగిస్తుంది. అందువల్ల టర్నరౌండ్ సమయం కూడా తగ్గుతుంది. LHB రైలులో 2 సెకండ్ లగేజీ, గార్డ్ & దివ్యాంగులకు అనుకూలమైన కోచ్‌లు, 8 సెకండ్ క్లాస్ అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు, 12 సెకండ్ క్లాస్ 3-టైర్ స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. అన్ని కోచ్‌లు నాన్-ఏసీగా ఉంటాయి.
అంత్యోదయ ఎక్స్ ప్రెస్ కు నెక్స్ట్ లెవెల్లో కొత్త రైలు
ఈ కొత్త రైలుకు సంబంధించిన లోకో మోటివ్‌లను చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (CLW)లో తయారు చేస్తున్నారు. అలాగే రైలు కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేస్తారు. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తయారు చేస్తున్న ఏకైక భారతీయ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్. రైల్వే బోర్డ్ అక్టోబర్‌లో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో ఈ ఏడాది చివరి నాటికి కొత్త రైలు నమూనాను రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2017వ సంవత్సరంలో సామాన్య ప్రజలకు మెరుగైన అన్‌రిజర్వ్‌డ్ ప్రయాణం కోసం కొత్త అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశ పెట్టింది. మరోసారి తాజాగా తయారు చేయబోతున్న కొత్త రైలు.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రముఖ లక్షణాలను కల్గి ఉంటుందని తెలుస్తోంది. ఈ రైలు అంత్యోదయ కోచ్‌లకు మరో మెట్టు పైనే ఉండేలా కనిపిస్తోంది.