New Pamban Bridge : తమిళనాడులోని పంబన్ బ్రిడ్జి గురించి అందరికీ తెలిసిందే. రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే ఓ కొత్త పంబన్ బ్రిడ్జి ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 105ఏళ్ల నాటి వారధి స్థానంలో నిర్మించిన ఈ వంతెనను సరికొత్త టెక్నాలజీ తో రూపొందించారు. ఇది ఇండియాలోని అన్ని బ్రిడ్జ్ ల కంటే ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఇండియాలోని మండపం నుంచి పంబన్ దీవిలోని రామేశ్వరంని కలుపుతుంది. ఇది చాలా ప్రాచీనమైన కట్టడం. దీన్ని ఫిబ్రవరి 24, 1914లో ప్రారంభించగా.. మళ్లీ ఇప్పుడు ఈ వంతెననగా సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. పాత బ్రిడ్జి తుప్పు పట్టి పోవడంతో ఆ వంతెనకు దగ్గర్లోనే కొత్త పాంబన్ బ్రిడ్జిని నిర్మించినట్లు ఇటీవల కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కాగా మార్చి 2019లో ఈ కొత్త పాంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ చేశారు.
ట్రయల్ రన్ విజయవంతం
2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) ఈ వంతెన పనులను చేపట్టింది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని తొలిసారిగా సముద్రం మధ్యలో 17 మీటర్ల ఎత్తులో రూ.550 కోట్లతో నిర్మించారు. ఇప్పటికే ఈ వంతెన ట్రయల్ రన్ సైతం విజయవంతమైంది. అయితే రామేశ్వరం మండపం జిల్లా పట్టణం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవికి వెళ్లాలంటే కేవలం సముద్రం మీదుగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ రెండు ప్రాంతాలను సముద్ర మార్గాన్ని లింక్ చేసేలా పంబన్ రైల్వే బ్రిడ్జ్ ను నిర్మించారు. అంతేకాదు అవసరానికనుగుణంగా లిఫ్ట్ చేసేలా నిర్మించిన ఫ్లెక్సిబుల్ బ్రిడ్జి ఇది. దేశంలోనే తొలి వర్టికల్ బ్రిడ్జిగా పేరుగాంచిన ఈ వంతెనను త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు సమాచారం.
కొత్త పంబన్ బ్రిడ్జి గురించి
దాదాపు నాలుగేళ్లలోనే కొత్త పంబన్ బ్రిడ్జి పనులను పూర్తి చేశారు. వంతెనపై ఏర్పాటుచేసిన 600 మీటర్ల పరిధిలో భారీ సైజు వర్టికల్ లిఫ్ట్ నిర్మాణానికి సుమారు 5నెలల సమయం పట్టింది. దీని బరువు 660 టన్నులు. పొడవు 72.5 మీటర్లు. సముద్రంలో దీని పొడవు 2.08 కిలో మీటర్లు. బ్రిడ్జ్ కి ఇరువైపులా భారీ స్తంభాలను ఏర్పాటు చేయగా.. వాటికి 320 టన్నుల బరువున్న దూలాలు వేలాడేలా నిర్మాణం చేశారు. వాటి బరువు 625 టన్నులు. ఈ బ్రిడ్జ్ మరో ప్రత్యేకత ఏంటంటే.. వర్టికల్ లిఫ్ట్‌లో సుమారు 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం అవుతుంది. వంతెనను పైకి ఎత్తాల్సి వచ్చినప్పుడు మాత్రం కింద లిఫ్ట్‌లు, మోటార్ల సాయంతో పైకి లేస్తుంది. ఇదంతా రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తారు. సముద్రం అలలు బ్రిడ్జ్ పైకి వస్తూండడంతో ఇనుము పట్టాలు తుప్పు పడుతూంటాయి. ఆ కారణం వల్లే మునుపు నిర్మించిన వంతెన తుప్పు పట్టింది.
100 ఏళ్ల వరకు నో టెన్షన్
అప్పట్లో ఈ వంతెనను నిర్మించేందుకు సుమారు రూ.20 లక్షలు ఖర్చయినట్టు సమాచారం. కానీ అది అప్పటికి భారీ బడ్జెట్. ఈ వంతెన మొత్తం పొడవు 2.06 కిలోమీటర్లు. దీన్ని 2006-07లో మీటర్‌గేజ్ నుంచి బ్రాడ్‌గేజ్‌కి మార్చారు. కానీ ఇటీవలి కాలంలో ఈ పట్టాలు తుప్పు పట్టడంతో కొత్త నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి మళ్లీ అలాంటి సమస్య రాకుండా మూడు పొరల పాలీసిలోక్సేన్ పెయింట్ వేశారు. దీని వల్ల దాదాపు 58 ఏళ్ల వరకు తుప్పు పట్టదట. చిన్న చిన్న మరమ్మతులు చేస్తే వందేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ వర్టికల్ బ్రిడ్జ్ లో ఎలాంటి బోల్టులను వాడకుండా కేవలం వెల్డింగులోనే నిర్మించి, వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో లింక్ చేశారు. ఒకవేళ గంటకు 58 కి.మీ. గాలులు వీస్తే ఈ సెన్సార్లు ఆటోమేటిక్ గా బ్రిడ్జ్ ను క్లోజ్ చేస్తాయట.