Canada Gangster Murder : కెనడాలో భారత సంతతికి చెందిన గ్యాంగ్ స్టర్ హతమయ్యాడు. వాంకోవర్ సిటీలో ఓ వివాహకు హాజరైన గ్యాంగ్ స్టర్ అమర్ ప్రీత్ సామ్రపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అమర్ ప్రీత్ , అతని అన్న రవీందర్ కెనడా పోలీసుల మోస్ట్ వాయోలెంట్ లిస్టులో ఉన్నారు. గ్యాంగ్ స్టర్ అమర్‌ప్రీత్ సామ్ర ఫ్రేజర్‌వ్యూ బాంక్వెట్ హాల్‌లో పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. డ్యాన్స్ ఫ్లోర్‌లో పెళ్లికి వచ్చిన ఇతర అతిథులతో పాటు అతను కూడా డ్యాన్స్ చేశాడు. కాసేపటికే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్చి చంపేశారు.
గ్యాంగ్ స్టర్లుఅతడి వాహనానికి కూడా నిప్పు పెట్టారు. అమర్‌ప్రీత్ వర్గానికి బ్రదర్స్ గ్రూప్ వర్గానికి మధ్య వ్యాపార వ్యవహారాల్లో వైరం ఉంది. దుండగులు అమర్‌ప్రీత్ కోసం ఆ ఫంక్షన్ హాల్లో ముందు నుంచే కాపుకాచి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అమర్‌ప్రీత్‌ను కాపాడేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అతడికి సీపీఆర్ అందించినా గాయాల కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. 2022లో కెనడా ప్రభుత్వం, గ్యాంగ్‌లతో హింసకు పాల్పడుతున్న 11 మంది పేర్లను ప్రకటించింది. వీరిలో 9 మంది పంజాబ్ వాసులే కావడం గమనార్హం. ఈ జాబితాలో అమర్‌ప్రీత్, అతడి సోదరుడు రవీందర్ కూడా ఉన్నారు
గ్యాంగ్‌స్టర్ అమర్ ప్రీత్ సమ్రా ను చిక్కీ అనే మరో పేరుతో పిలుస్తారు. ఇతడిని హత్య చేసింది బ్రదర్స్ గ్రూప్ అనే మరో గ్యాంగ్ అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆగష్టు 2022లో 11 మంది ముఠా సభ్యులు తీవ్ర స్థాయి హింసకు పాల్పడ్డారని కెనడా పోలీసులు గుర్తించారు. వారికి దగ్గరగా ఎవరూ ఉండకూడదని.. సంబంధాలు పెట్టుకోవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల హెచ్చరికలో పేర్కొన్న 11 మందిలో అమర్‌ప్రీత్, అతని సోదరుడు రవీందర్‌తో సహా తొమ్మిది మంది పంజాబ్‌కు చెందినవారు ఉన్నారు. వీరు బ్రిటిష్ కొ లంబియా ప్రాంతంలో నేరాలకు పాల్పడుతూ ఉంటారు. ప్రావిన్స్‌లో జరిగిన హత్యలు, కాల్పులతో సంబంధం కలిగి ఉన్నారని అనుమానిస్తున్నారు.
పంజాబ్ కు చెందిన కొన్ని లక్షల మంది కెనడాలో స్థిరపడ్డారు. వారిలో కొంత మంది అక్కడ ఉండే.. గ్యాంగ్ స్టర్లుగా మారుతున్నారు. పంజాబ్ లోనూ వారి కార్యకలాపాలు ఉంటాయి. ఇటీవల ఖలిస్తాన్ పేరుతో హడావుడి చేసిన అమృత్ పాల్ సింగ్ తో పాటు ఆ మధ్య సింగర్ ను హత్య చేసిన వారి మూలాలు కూడా కెనడాలోనే ఉన్నాయని అనుమానిస్తున్నారు.