Indian Journalist Killed in New York: న్యూయార్క్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇండియన్ జర్నలిస్ట్ మృతి చెందాడు. హర్లేమ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలుడు కారణంగా మంటలు విపరీతంగా వ్యాపించాయి. అప్పటికే కొంత మంది కిటికీలో నుంచి దూకారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే...27 ఏళ్ల ఫాజిల్ ఖాన్ మాత్రం ఆ మంటల్లో చిక్కుకుని చనిపోయాడు. ఈ మేరకు ఇండియన్ ఎంబసీకి సమాచారం అందింది. 


"న్యూయార్క్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఫాజిల్ ఖాన్ చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది చాలా దురదృష్టకరం. న్యూయార్క్‌లోని ఎంబసీ ఫాజిల్ కుటుంబంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతోంది. భారత్‌కి అతని మృతదేహాన్ని పంపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విషయంలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం"


- ఇండియన్ ఎంబసీ న్యూయార్క్






కొలంబియా జర్నలిజం స్కూల్‌లో ఫాజిల్ ఖాన్ డేటా జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడు. 2018లో కాపీ ఎడిటర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఫాజిల్...CNN News 18లో కరెస్పాండెంట్‌గా పనిచేశాడు. ఆ తరవాత కొలంబియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసేందుకు 2020లో న్యూయార్క్‌కి వెళ్లాడు. ఇలా ఉన్నట్టుండి అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మంటలు చెలరేగిన వెంటనే తాళ్ల సాయంతో కొందరిని బయటకు తీసుకొచ్చారు. కొంత మంది పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.