Indian fishermen held captive in Bangladesh successfully released: బంగ్లాదేశ్‌లోని బాగర్‌హాట్ జైలులో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఎట్టకేలకు స్వేచ్ఛను పొందారు. భారత ప్రభుత్వం, బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో మంగళవారం మత్స్యకారుల విడుదల ప్రక్రియ పూర్తయ్యింది. బంగ్లాదేశ్ హోం శాఖ డిప్యూటీ సెక్రటరీ మహమ్మద్ అఫీజ్ ఆల్ అసాద్ స్వయంగా డాకా నుంచి జైలుకు చేరుకుని మత్స్యకారులను విడుదల చేశారు. ఈ క్రమంలో భారత హైకమిషన్ కౌన్సిలర్ చంద్రజీత్, ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ కలిసి విడుదలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.

Continues below advertisement

ప్రస్తుతం భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, భారతీయ మత్స్యకారులకు జైలులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేశామని బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు. విడుదలైన అనంతరం మత్స్యకారులను కట్టుదిట్టమైన భద్రత మధ్య మోంగ్లా పోర్టుకు తరలించారు. ప్రస్తుతం మోంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వారి ఫిషింగ్ బోట్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ పనులు ముగిసిన తర్వాత, భారత్-బంగ్లాదేశ్ విదేశాంగ ఒప్పందం ప్రకారం జనవరి 29వ తేదీన అంతర్జాతీయ జలాల్లో ఇరు దేశాల కోస్ట్ గార్డ్ అధికారుల సమక్షంలో మత్స్యకారులను భారత అధికారులకు అప్పగించనున్నారు.

ఈ 23 మంది మత్స్యకారుల్లో 9 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. మోంగ్లా పోర్టుకు చేరుకున్న వెంటనే వీరు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి కన్నీటిపర్యంతమయ్యారు. దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల్లో వీరంతా విశాఖపట్నం చేరుకుంటారని, కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందవద్దని వాసుపల్లి జానకిరామ్ భరోసా ఇచ్చారు. తమ విడుదలకు సహకరించిన భారత విదేశాంగ శాఖ, ఇండియన్ హైకమిషన్ మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు మత్స్యకారులు, వారి సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.         

Continues below advertisement

మత్స్యకారుల క్షేమ సమాచారం కోసం భారత విదేశాంగ శాఖ నిరంతరం బంగ్లాదేశ్ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. మోంగ్లా పోర్ట్ వద్ద బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ మరియు మెజిస్ట్రేట్ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. రేపు సాయంత్రం కల్లా బోట్లు సిద్ధమైతే, ఎల్లుండి ఉదయంకల్లా వీరు భారత జలాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ మత్స్యకారులు సురక్షితంగా విడుదల కావడం పట్ల ఏపీలోని వారి స్వగ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.