World War II Memorial Dance : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న రెండో ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం (World War II Memorial) వద్ద ఒక భారతీయ ఇంజనీర్ జంట చేసిన డాన్స్ రీల్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను వివాదానికి దారితీసింది. మధు రాజు అనే వ్యక్తి, అమెరికాలో క్లౌడ్ నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్‌గా పని చేస్తూ, యుద్ధ వీరుల త్యాగాలకు చిహ్నమైన ఆ పవిత్ర స్థలంలో డాన్స్ చేస్తూ వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో వైరల్ అయింది. దాదాపు 10 లక్షలకు పైగా వ్యూస్ పొందింది. వీరు చేసిన పని తీవ్ర విమర్శల పాలయింది. యుద్ధ వీరులను అవమానించారని మండిపడుతున్నారు. మధు రాజు అమెరికాలో హెచ్-1బి (H-1B) వీసాపై ఉంటూ ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నారు. దీనికి తోడు డల్లాస్‌లో MAD Dance అనే పేరుతో ఒక డాన్స్ స్టూడియోను కూడా నిర్వహిస్తున్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను గౌరవించాల్సిన చోట ఇలాంటి ప్రవర్తన సరికాదంటూ అమెరికన్ నెటిజన్లు, ముఖ్యంగా వెటరన్ల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. వివాదం ముదరడంతో మధు రాజు తన సోషల్ మీడియా ఖాతాలతో పాటు తన డాన్స్ స్టూడియో వెబ్‌సైట్‌ను కూడా తొలగించారు.
అప్పటికే నెటిజన్లు ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, గత చరిత్రను సేకరించి ఒక సమగ్ర నివేదిక తయారు చేశారు. ఈ వ్యవహారాన్ని అమెరికా విదేశాంగ శా దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయన వీసాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నాటికి ఈ అంశంపై అధికారికంగా ఫిర్యాదు అందే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు, సదరు కంపెనీ యాజమాన్యానికి కూడా నెటిజన్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికా కోసం ప్రాణత్యాగం చేసిన వారిని అవమానించే వ్యక్తిని ఉద్యోగంలో కొనసాగించడం కంపెనీ ప్రతిష్టకు భంగకరమని, తక్షణమే అతడిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. టెక్ రంగంలో వేలాది మంది స్థానిక అమెరికన్లు నిరుద్యోగులుగా ఉన్న తరుణంలో, ఇలాంటి ప్రవర్తన కలిగిన విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో కూడా చర్చనీయాంశమైంది. ఒక వ్యక్తి చేసిన బాధ్యతారాహిత్యమైన పని వల్ల మొత్తం ప్రవాస భారతీయులపై, ముఖ్యంగా హెచ్-1బి వీసా దారులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు కంపెనీ ఈ వివాదంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
