Indian astronaut Subhanshu Shukla reaches Earth: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలో 18 రోజుల పాటు జరిపిన ఆక్సియం-4 (Ax-4) మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి భూమికి తిరిగి వచ్చారు. శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు మధ్యాహ్నం 3.01 గంటలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్రతీరంలో ల్యాండయ్యారు.
సోమవారం వీరు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా తిరుగు పయనమయ్యారు. భూమిని చేరుకున్న వీరిని ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తారు. శుభాంశుతో పాటు ఉన్న వ్యోమగాములంతా అంతరిక్షంలో భారరహిత స్థితిలో గడిపారు. ఈ కారణంగా భూమిపైకి చేరగానే ఇక్కడి వాతావరణానికి వారి శరీరాలు అలవాటు పడేందుకు నాసా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందుకోసమే వారం రోజుల పాటు రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచుతారు. ఇస్రోకు చెందిన వైద్యాధికారులు కూడా ఈ వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 18 రోజుల అంతరిక్ష యాత్రలో శుక్లా టీం అనేక పరిశోధనలు జరిపింది.
శుభాంశు , అతని టీమ్ స్పేస్‌లో 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించారు. ఇందులో 7 ISRO రూపొందించినవి. క్రోగ్రావిటీలో విత్తనాలు మొలకెత్తడం , అభివృద్ధిని పరిశీలించడం, భవిష్యత్ అంతరిక్ష వ్యవసాయం కోసం జన్యు లక్షణాలు, సూక్ష్మజీవుల పరస్పర చర్యలు, పోషక విలువలను అర్థం చేసుకోవడం. సున్నా గురుత్వాకర్షణలో మైక్రోఆల్గీ సాగు, ఆక్సిజన్, ఆహారం, బయోఫ్యూయల్ ఉత్పత్తికి దాని సామర్థ్యాన్ని పరీక్షించడం. అంతరిక్షంలో గ్లూకోజ్ పర్యవేక్షణ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అంతరిక్ష ప్రయాణాన్ని మరింత సమగ్రంగా చేయడానికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నదానిపై పరిశోధనలు చేశారు.
శుభాంశు భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్, టెస్ట్ పైలట్. ఇస్రో వ్యోమగామిగా ఉన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (2005), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2020-2021లో రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రాథమిక శిక్షణ తీసుకున్నారు. బెంగళూరులోని ISRO ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో అధునాతన శిక్షణ, యు నాసా, ESA, JAXAతో సంయుక్త శిక్షణ. పొందారు.