భారత వాయుసేన (ఐఏఎఫ్)లో సుఖోయ్ ఎస్ యూ-30 యుద్ధ విమానం ప్రత్యేకతే వేరు. ఎన్నో యుద్ధాల్లో సుఖోయ్ విమానాలు భారత్ సత్తాను ప్రపంచానికి చాటాయి. అయితే చరిత్రలో తొలిసారిగా సుఖోయ్ ఎస్ యూ-30 ఫైటర్ జెట్ ను నేషనల్ హైవేపై ల్యాండ్ చేశారు. రాజస్థాన్ జాలోర్ జాతీయ రహదారిపై ఈ ఫీట్ చేసింది ఐఏఎఫ్.






సుఖోయ్ మాత్రమే కాదు సీ- 130J సూపర్ హెర్క్యూల్స్ ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ను జాలోర్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రోడ్డు రవాణా మంత్రి సహా వాయుసేన అధిపతి ఆర్ కే ఎస్ భదౌరియా ఉన్నారు.






NH 925Aపై ఏర్పాటు చేసిన ఈ అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీని కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రారంభించారు. 3 కిమీ ఉన్న ఈ అత్యవసర ల్యాండింగ్ రహదారిని జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అభివృద్ధి చేసింది. ఐఏఎఫ్ కు చెందిన విమానాలు, ఫైటర్ జెట్ లు ఇక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం దీనిని వినియోగించుకోనున్నాయి.


2017 అక్టోబర్ లో ఇదే తరహా మాక్ డ్లిల్ ను ఐఏఎఫ్ నిర్వహించింది. లఖ్ నవూ- ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై అత్యవసర ల్యాండింగ్ కోసం ఈ డ్రిల్ నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర హైవేలపై అత్యవసర ల్యాండింగ్ కు కావాల్సిన ఏర్పాట్లపై ఇటీవల భారత్ దృష్టి పెట్టింది. ప్రమాదాలను నిలువరించేందుకు ఈ చర్యలు చేపట్టింది.


Also Read: PM Narendra Modi: పారాలింపిక్ ఛాంపియన్లతో ప్రధాని మోదీ చిట్ చాట్