Wrestlers Protest: 



ఛార్జ్‌షీట్..


లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇదే సమయంలో ఆయనపై పోక్సో చట్టం కింద నమోదు చేసిన కేసుని రద్దు చేయాలని ఓ రిపోర్ట్‌ని రౌజ్ అవెన్యూ కోర్టులో సమర్పించారు. ఏ ఆధారాలు లేని కారణంగా...ఈ కేసుని రద్దు చేయాలని నివేదికలో పేర్కొన్నారు ఢిల్లీ పోలీసులు. అయితే..ఈ రిపోర్ట్‌పై కోర్టు విచారణను వాయిదా వేసింది. జులై 4వ తేదీన విచారిస్తామని వెల్లడించింది. ఇదే నివేదికలో మైనర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌నీ చేర్చారు పోలీసులు. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసు రద్దు చేయాలని కోరుతున్నట్టు అందులో పేర్కొన్నారు. మైనర్ రెజ్లర్ తండ్రి ఇటీవలే మీడియాతో మాట్లాడారు. తన కూతురుని బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించలేదని, కానీ కావాలనే తనపై కుట్ర చేసి ఆడకుండా చేశాడని ఆరోపించారు. ఇదే సమయంలో పోలీసులు ఆయనపై పోక్సో కేసు రద్దు చేయాలని కోరడం కీలకంగా మారింది. 


ఇప్పటికే ఆయనపై రెండు FIRలు నమోదు చేశారు. దాదాపు 10 కేసులు పెట్టారు. అయితే...రెజ్లర్లు ఆయనను అరెస్ట్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. చాలా రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవలే కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో భేటీ అయ్యారు. జూన్ 15లోగా ఆయనపై ఛార్జ్‌షీట్ దాఖలయ్యేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆ గడువు దగ్గర పడటం వల్ల పోలీసులు ఆయనపై ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. ఆ ఫైల్స్‌తో రౌజ్ అవెన్యూ కోర్టుకి వచ్చారు. కోర్టులో ఆ ఛార్జ్‌షీట్‌ని సమర్పించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఐదు దేశాల రెజ్లింగ్ ఫెడరేషన్‌లకు లేఖలు రాశారు. బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై సమాచారం అందించాలని కోరారు. ఇప్పటి వరకూ ఆ ఫెడరేషన్స్‌ స్పందించలేదు. అవి రెస్పాండ్ అయిన తరవాతే ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తారని భావించారు. అయితే...ఈలోగానే ఫైల్ చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా వేసిన కమిటీ కూడా ఆయా దేశాల ఫెడరేషన్స్‌కి నోటీసులు పంపింది. మ్యాచ్‌లు ఆడిన సమయంలో ఇండియన్ రెజ్లర్లు ఎక్కడెక్కడ ఉన్నారో వివరాలు అడిగింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లతో పాటు, ఫొటోలు, వీడియోలు పంపాలని కోరింది కమిటీ.