Infosys asking employees electricity usage data: ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల ఇంటి విద్యుత్ వినియోగ వివరాలను సేకరిస్తోంది. హైబ్రిడ్ పని విధానం వల్ల కంపెనీ కార్యకలాపాలు కేవలం ఆఫీసు క్యాంపస్‌లకే పరిమితం కాకుండా ఉద్యోగుల ఇళ్లకు కూడా విస్తరించాయని, దీనివల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడమే దీని ప్రధాన ఉద్దేశమని కంపెనీ తెలిపింది.
ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నప్పుడు వాడే విద్యుత్ కూడా ఇన్ఫోసిస్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల పరిధిలోకి వస్తుందని కంపెనీ సీఎఫ్ఓ జయేష్ సంఘరాజ్కా వివరించారు. ఈ వివరాల ద్వారా కంపెనీ పర్యావరణంపై చూపుతున్న ప్రభావాన్ని మరింత ఖచ్చితంగా లెక్కించేందుకు మరియు తగిన స్థిరమైన చర్యలు చేపట్టేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సర్వేలో భాగంగా ఉద్యోగులు వాడే విద్యుత్ పరికరాలు ఫ్యాన్లు, ఏసీలు, హీటర్లు , లైట్ల వాటేజ్, వారి ఇళ్లలో సోలార్ పవర్ వాడుతున్నారా లేదా అనే వివరాలను అడుగుతున్నారు. సుమారు 3 లక్షల మంది ఉద్యోగుల నుండి ఈ సమాచారాన్ని సేకరించి, దానికి అనుగుణంగా స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి ద్వారా పర్యావరణ ప్రభావాన్ని సమతుల్యం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే, ఈ చర్యపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తోంది. ఆఫీసులకు ప్రయాణించేటప్పుడు వెలువడే కాలుష్యాన్ని కూడా లెక్కించాలని కొందరు సూచిస్తుండగా, భవిష్యత్తులో ఉద్యోగులను పూర్తిగా ఆఫీసులకు పిలిపించేందుకే ఈ విధమైన గణాంకాలు సేకరిస్తున్నారేమోనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా, గత 15 ఏళ్లుగా సుస్థిరతపై దృష్టి పెట్టిన ఇన్ఫోసిస్, ఇప్పుడు ఇంటి పని వాతావరణాన్ని కూడా అందులో భాగం చేసింది.