Most Powerful Drones : భారత్, పాకిస్తాన్ మధ్య జరిగి పోరాటంలో డ్రోన్లు అత్యంత శక్తిమంతమైన పాత్ర పోషించాయి. దీంతో వార్‌లో వీటి పాత్ర ఏ స్థాయిలో ఉందే అర్థమైంది. గతంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య జరిగిన వార్‌లో కూడా డ్రోన్‌లను వాడుకున్నారు. ఇప్పుడు లెటెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఘర్షణే. 

ఎక్కడికీ కదలకుండా ప్రత్యర్థుల స్థావరాలను తెలుసుకోవడమే కాదు వాటిని ధ్వంసం చేయడంలో ఈ డ్రోన్లు చాలా ఉపయోగపడ్డాయి. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రస్థావరాలను, సైనిక పోస్టులను కొట్టడంలో భారత్ ఈ డ్రోన్ల సహాయంతో విజయవంతమైంది. పాకిస్తాన్ కూడా డ్రోన్ల సాయంతో దాడికి యత్నించినా మనకి ఉన్న డిఫెన్స్ సిస్టమ్‌ వాటిని పేల్చేసింది.   

ఈ సంఘర్షణలో డ్రోన్‌లు కీలక పాత్ర పోషించాయి. భారతదేశం డ్రోన్ల సహాయంతో పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థతోపాటు అనేక వైమానిక స్థావరాలు, ఇతర ప్రాంతాలను ధ్వంసం చేసింది. ఆధునిక యుద్ధాలలో డ్రోన్ల పాత్ర చాలా పెరిగిందని చెప్పడానికి ఇది చాలు. దీనికి ప్రధాన కారణం వీటి ఖర్చు తక్కువ, పైలట్ అవసరం లేదు.. ఇవి లక్ష్యాన్ని గుర్తించి దాడి చేయగలవు. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, శక్తివంతమైన డ్రోన్ ఏ దేశం వద్ద ఉందో తెలుసుకుందాం.

MQ-9 రీపర్

రక్షణ రంగంలో అమెరికా, రష్యా ఆయుధాలు అగ్రగామిగా నిలుస్తున్నాయి. అమెరికా వద్ద MQ-9 రీపర్ అనే డ్రోన్ ఉంది, దీనిని అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ సంస్థ తయారు చేసింది. ఇది చాలా ప్రమాదకరమైనది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్, దీనిని శత్రువులను పర్యవేక్షించడానికి, వారి గూఢచర్యం చేయడానికి, వారిపై దాడి చేయడానికి ఉపయోగిస్తారు. MQ-9 రీపర్ ఎక్కువసేపు ఎత్తులో  ఎగరగలుగుతుంది. ఇది ఎగిరే టైంలో ఎలాంటి శబ్ధం ఉండదు. శత్రువులు గుర్తించేలోపు వారిని నాశనం చేయగలదు. మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, దీని పరిధి దాదాపు 1900 కిలోమీటర్లు, ఇది 50,000 అడుగుల ఎత్తులో ఎగరగలుగుతుంది .

MQ-9 రీపర్ ఎలా హ్యండిల్ చేస్తారు ?

MQ-9 రీపర్‌ను ఎక్కడైనా కూర్చుని, వీడియో గేమ్స్ లాగా సులభంగా నియంత్రించవచ్చు. దీన్ని నియంత్రించడానికి ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు అవసరం. ఈ డ్రోన్ మొదటిసారిగా 2001లో ఎగిరింది. దీని కచ్చితత్వం, విధ్వంసక శక్తిని అమెరికా అఫ్ఘానిస్తాన్, ఇరాక్, సిరియా వంటి యుద్ధ ప్రాంతాల‌్లో దీన్ని విస్తృతంగా ఉపయోగించారు. దీని నుంచి హెల్‌ఫైర్ క్షిపణులు, లేజర్ తో పని చేసే బాంబులు ప్రయోగించవచ్చు.  భారతదేశం కూడా అమెరికా నుంచి MQ-9 రీపర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. నివేదికల ప్రకారం, రెండు దేశాల మధ్య దీనికి సంబంధించి దాదాపు 34,500 కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది.

ప్రస్తుతం భారత్‌లో ఉన్న డ్రోన్లు ఇవే:-హెరాన్‌ UAV డ్రోన్‌ను ఇజ్రాయెల్ కంపెనీ తయారు చేసింది. సుదూరాలపై నిఘా ఉంచేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఇది 30వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. 40 గంటల పాటు పని చేస్తుంది. దీనికి నైట్‌ విజన్, లైవ్ వీడియో తీసే ఫెసిలిటీ కూడా ఉంది. ఎంకే -IIను కూడా ఇజ్రాయెల్ తయారు చేసింది. దీన్ని వ్యూహాత్మక నిఘా కోసం ఉంచుతారు. షార్ట్ రేంజ్‌, తక్కువ ఎత్తులో  పని చేస్తుంది. 18 గంటలు పని చేస్తుంది. 

భారత్ కూడా కొన్ని డ్రోన్లు తయారు చేసుకుంది. వాటిలో ముఖ్యమైంది. రుస్తుం UAV సిరీస్‌ డ్రోన్‌ను డీఆర్‌డీవో తయారు చేసింది. ఇది ప్రస్తతం ట్రయల్ రన్‌లో ఉంది. రెండోది స్విచ్‌ డ్రోన్. దీన్ని ముంబై బేస్డ్‌ స్టార్టప్‌ తయారు చేసింది. ఎత్తైన ప్రాంతాల్లో దీన్ని వాడతారు. మూడోది జెన్ టెక్నాలజీ వ్యూహాత్మక నిఘా కోసం వాడుతారు. వీటితోపాటు కాంబాట్‌ డ్రోన్లు కూడా సైన్యంలోకి రానున్నాయి.