Earthquake In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం భూకంపం భయకంపితులను చేసింది. వచ్చినవి ప్రకంపనలే అయిన జనం భయంతో వణికిపోయారు. ఢిల్లీతోపాటు NCR ప్రాంతంలో కూడా భూకంపం సంభవించింది. ఈ సమయంలో నోయిడా, గాజియాబాద్,  గుర్గావ్ సహా అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం, జులై 10న ఉదయం 9:04 గంటలకు భూకంపం వచ్చింది, దీని కేంద్రం హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఉంది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఢిల్లీలో అతిపెద్ద భూకంపం ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా? ఆ సమయంలో ఎంత నష్టం జరిగింది?

ఢిల్లీలో అతిపెద్ద భూకంపం ఎప్పుడు వచ్చింది?

అధికారిక సమాచారం ప్రకారం, ఆగస్టు 27, 1960న దేశ రాజధాని ఢిల్లీలో అతిపెద్ద భూకంపం వచ్చింది. ఆ సమయంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఉదయం వేళ  భూకంపం ప్రకంపనలు వచ్చాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజ, ఇతర భూకంప రికార్డుల ప్రకారం, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.6 మాగ్నిట్యూడ్. ఈ భూకంపం కేంద్రం ఢిల్లీ సమీపంలోనే ఉంది. ఈ భూకంపం నగరాన్ని చాలా దెబ్బతీసింది.

ఢిల్లీ పరిస్థితి ఇలా ఉంది

మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, ఆగస్టు 27, 1960న వచ్చిన ఈ భయంకరమైన భూకంపం కారణంగా ఢిల్లీలోని అనేక భవనాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. ఓల్డ్‌ ఢిల్లీ, చాందినీ చౌక్,  ఎర్రకోట వంటి ప్రాంతాల్లోని భవనాలకు చాలా నష్టం వాటిల్లింది. దీనితోపాటు ఎర్రకోట, రాష్ట్రపతి భవన్ వంటి చారిత్రక కట్టడాలు కూడా కొద్దిగా దెబ్బతిన్నాయి. భూకంపం కారణంగా శిథిలాలు పడటం,  తొక్కిసలాట ఏర్పడటం వల్ల దాదాపు 100 మంది గాయపడ్డారు.

 ఢిల్లీ ఓ జోన్‌లో ఉంది?

ఢిల్లీ భూకంప జోన్-4లో ఉందని గమనించాలి, ఇది మధ్యస్థం నుంచి అధిక ప్రమాదం ఉన్న ప్రాంతంగా పరిగణిస్తారు. ఈ ప్రాంతం హిమాలయ ప్రాంతం, భారతీయ ప్లేట్ యూరేషియన్ ప్లేట్‌తో ఢీకొనడం వల్ల భూకంప వస్తుంది.  1960 భూకంపం కేంద్రం ఢిల్లీ సమీపంలో 5 కిలోమీటర్ల లోతులో ఉంది, దీని కారణంగా తీవ్రమైన ప్రకంపనలు వచ్చాయి. భూకంప శాస్త్రవేత్తల ప్రకారం, ఢిల్లీలో భూకంపాలు తరచుగా స్థానిక అంతర్గత కదలికలు లేదా హిమాలయ ప్రాంతంలోని టెక్టోనిక్ కార్యకలాపాలకు సంబంధించినవి.

ఈ భూకంపాలు కూడా ఢిల్లీని కదిలించాయి

1960లో వచ్చిన అతిపెద్ద భూకంపం మాత్రమే కాకుండా, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాసార్లు బలమైన ప్రకంపనలు వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం.

  • 1720: ఈ సంవత్సరం దాదాపు 6.5 మాగ్నిట్యూడ్ భూకంపం వచ్చింది, ఇది ఢిల్లీ, పరిసర ప్రాంతాలను తీవ్రంగా కదిలించింది.
  • 1803: ఈ సంవత్సరం గర్వాల్-ఉత్తరాఖండ్ ప్రాంతంలో భూకంపం తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి, ఇవి ఢిల్లీ వరకు ప్రభావం చూపాయి. ఇందులో ఢిల్లీలోని కుతుబ్ మినార్ గుమ్మటం కూడా దెబ్బతింది.
  • 1905: ఈ సంవత్సరం హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో 7.8 మాగ్నిట్యూడ్ భూకంపం వచ్చింది. దీని ప్రకంపనలు ఢిల్లీతో సహా మొత్తం ఉత్తర భారతదేశంలో ఉంది. అంతటా భయానక వాతావరణం ఏర్పడింది. ప్రజలు వణికిపోయారు.