Murshidabad Violence:వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఉద్దేశించి చేసిన కొత్త చట్టం దేశంలోని చాలా ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రతిఘటన ఎదురవుతోంది. పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో అత్యంత ఆందోళనకరమైన ఘటనలు జరుగుతున్నాయి. అక్కడ నిరసనలు హింసాత్మకంగా మారాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు చేరుకుంది వ్యవహారం. అయినా సరే మమత బెనర్జీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముర్షిదాబాద్‌లో హిందూ కుటుంబాలపై దాడులు జరుగుతున్నాయని సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దుకాణాలపై పడి దోచుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మొన్న శుక్రవారం ప్రార్థనల తర్వాత ఓ గుంపు గందరగోళం సృష్టించిందని దీంతో అ ప్రాంతంలో ఉండే ప్రజలంతా పారిపోయారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోల్లో ఓ వర్గం ప్రజలు దాడులు, రాళ్లు రువ్వడం కనిపిస్తోంది. ఈ వీడియోలు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. 150 మందికిపైగా ఆందోళనకారులను అరెస్టు చేసినట్టు సమాచారం. అయినా అక్కడి పరిస్థితి సద్దుమణగలేదని సమాచారం.
సోషల్ మీడియాలో తిరుగుతున్న వీడియోల్లో బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారని అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సత్తా చూపుతామని బెదిరిస్తున్న వాయిస్ కూడా ఉంది. ముర్షిదాబాద్‌లో పరిస్థితిపై మమత స్పందించి ఇదంతా భారతీయ జనతా పార్టీ కుట్రగా అభివర్ణించారు. ఈ ఘర్షణల్లో నష్టపోయిన బాధితులకు పరిహారం ప్రకటించారు.
ముర్షిదాబాద్ అల్లర్లపై ఏప్రిల్ 16 బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇదంతా బీజేపీ కుట్రగా చెప్పుకొచ్చారు. బిఎస్ఎఫ్ వంటి కేంద్ర సంస్థలు మంటలు పెరిగేందుకు చురుకైన పాత్ర పోషించాయని ఆమె ఆరోపించారు. సరిహద్దు వెంబడి ఆంక్షలను బిఎస్ఎఫ్ సడలించిందని ఫలితంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పెరిగాయని ఆమె అన్నారు.
హింసను "ప్రణాళిక ప్రకారం" ప్రేరేపిస్తున్నారని మమత ఆరోపించారు. కేంద్ర దళాలు శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమవడమే కాకుండా గందరగోళాన్ని ప్రేరేపించడంలో కూడా చురుకుగా పాల్గొన్నాయని సిఎం బెనర్జీ ఆరోపించారు. "ముర్షిదాబాద్ అశాంతిలో సరిహద్దు అవతల నుంచి వచ్చిన వ్యక్తుల పాత్ర ఉందని సమాచారం నాకు వచ్చింది. సరిహద్దును కాపాడటం బిఎస్ఎఫ్ పాత్ర కాదా? రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ సరిహద్దును కాపాడదు" అని ఆమె చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను నిరోధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మమత ఆరోపించారు. తద్వారా ఈ ప్రాంతం అస్థిరతకు కారణమవుతున్నారని మండిపడ్డారు.