పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీ సర్కార్‌కు మరో షాక్ తగిలింది. మమతా బెనర్జీ కేబినెట్‌లో అటవీ శాఖ మంత్రిగా ఉన్న జ్యోతిప్రియ మల్లిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. జ్యోతిప్రియ మల్లిక్ ఆహార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ స్కామ్ జరిగిందనే ఆరోపణలతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. జ్యోతిప్రియ మల్లిక్‌ను 20గంటలపాటు ప్రశ్నించిన తర్వాత... ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
కోల్‌కతా శివారు సాల్ట్‌లేక్‌లోని మల్లిక్ ఇంట్లో ఈడీ అధికారులు నిన్నటి నుంచి సోదాలు నిర్వహించారు. ఇవాళ ఆయన్ను అరెస్టు చేసి... సీజీవో కాంప్లెక్స్‌లోని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో మల్లిక్ మీడియాతో మాట్లాడారు. ఇదంతా ఒక కుట్ర అని... తాను బాధితుడినని చెప్పారాయన.
మల్లిక్ ఆహార శాక మంత్రిగా ఉన్నప్పుడు రేషన్ పంపిణీలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలకు సంబంధించి... ఆయన ఇంటితోపాటు సహచరుల ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఏకకాలంలో ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించారు. రేషన్ స్కామ్‌లో ఇటీవల అరెస్టయిన వ్యాపారవేత్త బాకీబుర్ రెహమాన్‌తో మల్లిక్‌కు ఉన్న సంబంధాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. మల్లిక్‌ను 20 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు... ప్రధానంగా రెహమాన్‌తో మల్లిక్‌కు ఉన్న సంబంధాలపైనే ఆరా తీసినట్టు సమాచారం.
నిన్న (గురువారం) ఉదయం 6:30 గంటల సమయంలో సాల్ట్‌లేక్‌లోని మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ ఇంటికి వచ్చారు ఈడీ అధికారులు. మంత్రికి చెందిన సాల్ట్ లేక్ బీసీ బ్లాక్‌లోని రెండు ఫ్లాట్లలో నిన్న (గురువారం) ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహించింది. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని నాగర్‌బజార్‌లోని మల్లిక్ వ్యక్తిగత సహాయకుడు అమిత్‌డే ఇంట్లోనూ తనిఖీ చేశారు ఈడీ అధికారులు.
గత వారం మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ అనుచరుడు రెహమాన్‌ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. కైఖలిలోని అతని ఫ్లాట్‌లో 53గంటలకుపైగా సోదాలు చేశారు. ఆ తర్వాత రెహమాన్‌ను అరెస్టు చేశారు. అతని ఫ్లాట్‌లో ప్రభుత్వ కార్యాలయాల స్టాంపులతో కూడిన 100కు పైగా డాక్యుమెంట్లు లభ్యమైనట్లు ఈడీ వర్గాలు చెప్పాయి. రెహమాన్‌కు రైస్‌మిల్లు వ్యాపారంతో పాటు అనేక హోటళ్లు, రిసార్ట్‌లు, బార్లు ఉన్నాయి. అతడి కంపెనీల్లో రూ.50 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఈడీ వర్గాలు తెలిపాయి.
తృణమూల్ కాంగ్రెస్ నేతల అరెస్టులతో... మమతా బెనర్జీ ప్రభుత్వం చుక్కుల్లో పడుతోంది. ఇప్పటికే టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో మాజీ విద్యా మంత్రి పార్థ ఛటర్జీ, అతని సహాయకురాలు అర్పితా ముఖర్జీని ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత.. టీఎంసీ బర్భమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్ కూడా.. పశువుల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయ్యారు. బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి మేనల్లుడు, టీఎంసీ అధినేత అభిషేక్ బెనర్జీపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన్ను ఈడీ చాలా సార్లు పిలిచి ప్రశ్నించింది. ఇక.. తాజాగా టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కూడా ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.
ఈడీ దాడులు... తృణమూల్ కాంగ్రెస్ నేతల వరుస అరెస్టులపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైరయ్యారు. మోడీ సర్కార్‌తోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీ నేతలు, మంత్రులను బీజేపీ సర్కార్ వేధిస్తోందన్నారు దీదీ. తృణమూల్ కాంగ్రెస్ నేతల ఇళ్లను కేంద్ర ఏజెన్సీలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. సోదాలు, తనిఖీల పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఒక్క బీజేపీ నాయకుడి ఇంటిపై ఎందుకు సోదాలు చేయడంలేదని కూడా ఆమె ప్రశ్నించారు. దేశం ఇలానే నడుస్తుందా? చట్టాన్ని వారికి తగట్టు మార్చుకుంటారా అని క్వశ్చన్ చేశారు మమతా బెనర్జీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని పిలుస్తున్నారని అన్నారు. అంతేకాదు... హఠాత్తుగా భారతదేశం పేరు కూడా మార్చారని మండిపడ్డారు. మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌కి ఇప్పటికే మధుమేహం ఉందని... ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని... ఆయన చనిపోతే బీజేపీ, ఈడీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తానని కూడా హెచ్చరించారు మమతా బెనర్జీ.
ఇక, బెంగాల్ బీజేపీ నేతలు మమతా బెనర్జీ ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. రేషన్ స్కామ్‌లో నిందితుడుగా ఉన్న రెహమాన్‌కు 2012 నుండి మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ తెలుసుని అన్నారు ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి. ఇది చాలా పెద్ద స్కామ్ అని ఆరోపించారాయన. రెహ్మాన్ పేరుతో ఉన్న కోట్లాది రూపాయలన ఆస్తుల లింకులను ఈడీ గుర్తించిందని... ఆ ఆస్తులు ఎవరివో త్వరలోనే బయటకు వస్తుందని అంటున్నారు బెంగాల్ బీజేపీ నేతలు.