Waqf Bill:వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్ సభలో ప్రవేశ పెట్టిన తర్వాత మొదలైన చర్చ సుదీర్ఘంగా సాగింది. దాదాపు 12 గంటలపాటు ఈ బిల్లుపై చర్చించారు. అర్థరాత్రి దాటిన తర్వాత 12.17నిమిషాలకు ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగిన సమయంలో లోక్‌సభలో 390 మంది సభ్యులు ఉన్నారు. వారిలో బిల్‌కు అనుకూలంగా 226మంది ఓటు వేస్తే వ్యతిరేకంగా 163 మంది ఓటు వేశారు. ఒక సభ్యుడు దూరంగా ఉన్నారు. 

ఉదయం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ( ఏప్రిల్ 2) లోక్ సభ ముందు ఉంచారు. అనంతరం దాదాపు అన్ని పక్షాలు ఈ బిల్లుపై మాట్లాడాయి. ఆఖరున హోంమంత్రి అమిత్‌షా మాట్లాడారు. ప్రతిపక్షంపై తీవ్ర దాడి చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ముస్లిం సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసి దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ఈ బిల్లు ద్వారా ముస్లింల మతపరమైన విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనుకుంటోందని ప్రతిపక్ష సభ్యుల విమర్శలను తోసిపుచ్చారు. వక్ఫ్ ఆస్తుల మెరుగైన నిర్వహణే ఈ చట్టం లక్ష్యమని అన్నారు. ఈ బిల్లును గత విషయాలపై అమలు చేయబోమని, ప్రతిపక్ష సభ్యులు ముస్లిం సమాజ సభ్యుల్లో భయాన్ని సృష్టించడానికి, తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అన్నారు.

"ఇది గతానికి సంబంధించిన విషయాలకు వర్తిస్తుందనే మరో అపోహ వ్యాప్తి చెందుతోంది. ఈ సభలో మీరు మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడండి. బిల్లు ఆమోదించినప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత చట్టం అమలులోకి వస్తుందని బిల్లు స్పష్టంగా పేర్కొంది. కాబట్టి, గతానికి సంబంధించిన వాటిపై ప్రభావం ఉండదు. కానీ ముస్లింలను భయపెడుతున్నారు" అని షా అన్నారు.

మతానికి సంబంధించిన ప్రక్రియలో ముస్లిమేతరుల నియామకానికి బిల్లులో ఎలాంటి నిబంధన లేదని బిజెపి షా వెల్లడించారు. 2013లో వక్ఫ్‌ను సవరించకపోతే, ఈ బిల్లు అవసరం ఉండేది కాదని ఆయన అన్నారు. "అంతా బాగానే జరిగింది. కానీ 2014లో ఎన్నికలు జరిగాయి, 2013లో రాత్రికి రాత్రే, వక్ఫ్ చట్టాన్ని బుజ్జగింపు కోసం స్వరూపాన్ని మార్చారు. ఫలితంగా, ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, కేవలం 25 రోజుల ముందు లుటియన్స్ ఢిల్లీలోని 123 వివిఐపి ఆస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్‌కు అప్పగించింది..." అని షా అన్నారు, 

ఒక వ్యక్తి తనకు చెందిన ఆస్తిని మాత్రమే దానం చేయగలడని, ప్రభుత్వానికి లేదా మరే ఇతర వ్యక్తికి చెందిన దానిని దానం చేయలేడని షా అన్నారు. పరిపాలనా విధులను నిర్వహించే 1955 చట్టంలోని కౌన్సిల్, బోర్డుకు సంబంధించిన నిబంధనల్లో మాత్రమే మార్పులు చేశామని ఆయన అన్నారు.