Waqf Amendment Act 2025: వక్ఫ్ (సవరణ) చట్టం 2025 ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు (ఏప్రిల్ 8,2025) నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టంలోని సెక్షన్ 1(2) కింద జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, చట్టంలోని నిబంధనలు ఏప్రిల్ 8, 2025నుంచి అమలులోకి వచ్చే తేదీగా  నిర్ణయించింది. ఏప్రిల్ 4న పార్లమెంటు ఆమోదించిన చట్టం ఏప్రిల్ 5న రాష్ట్రపతి ఆమోదం పొందింది.

అనేక రాష్ట్రాల్లో నిరసనలు కొత్త వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతుండగా, కాంగ్రెస్, AIMIM, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వేర్వేరు పిటిషన్లతో సుప్రీంకోర్టులో దీనిని సవాలు చేశాయి. కేంద్రప్రభుత్వం ప్రకారం, ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదు. వక్ఫ్ ఆస్తుల పక్షపాతం, దుర్వినియోగాన్ని నిరోధించడమే దీని ఉద్దేశ్యం. లోక్‌సభలో, వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. కాగా, రాజ్యసభలో, బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి.

సుప్రీంకోర్టులో 15 పిటిషన్లు ఈ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఇప్పటివరకు మొత్తం 15 పిటిషన్లు దాఖలయ్యాయి. ఏకపక్ష ఉత్తర్వు వచ్చే అవకాశాన్ని నివారించడానికి కేంద్రప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. మణిపూర్, పశ్చిమ బెంగాల్, పాట్నాతో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.

వక్ఫ్ చట్టంపై జమాతే-ఇ-ఇస్లామీ హింద్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ తెరిచింది. జమాతే-ఇ-ఇస్లామీ హింద్ అధ్యక్షుడు సయ్యద్ సదాతుల్లా హుస్సేనీ మాట్లాడుతూ, "వక్ఫ్ చట్టం దేశంలోని ముస్లింలకు వ్యతిరేకం. ఈ చట్టం వక్ఫ్ పరిపాలనను మెరుగుపరచడంలో సహాయపడదని నేను భావిస్తున్నాను" అని అన్నారు.

"ఈ చట్టం సంస్కరణలను తీసుకువస్తుందని ప్రభుత్వం చెబుతోంది, కానీ దానిలో మార్పులు మరిన్ని సమస్యలకు దారి తీస్తాయని మేము నమ్ముతున్నాము. పరిపాలనను మరింత దిగజార్చే, అవినీతిని పెంచే, ముస్లింల హక్కులను హరించే నిబంధనలు ఈ చట్టంలో చేర్చారు" అని ఆయన అన్నారు.