Viral News: జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలి చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్యకాలంలో పెరిగిపోతోంది. ఫిట్ గా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిమ్ లకు వెళ్లి వ్యాయామాలు చేస్తున్న వారు అక్కడికక్కడే ప్రాణాలు వదులుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మరో యువకుడు జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ చనిపోయాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనతో మరోసారి భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సెక్టార్ 19 లో  తాజా ఘటన వెలుగుచూసింది. స్థానికంగా నివసించే 24 ఏళ్ల సాక్షం పృథ్వీ అనే యువకుడు గురుగ్రామ్ లో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇటీవలె బీటెక్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాడు. దగ్గర్లోని సెక్టార్ 15లో ఉన్న జిమ్ ఫ్లెక్స్ ఫిట్‌నెస్‌ జోన్ జిమ్ లో సాక్షం పృథ్వీ చేరాడు. ఫిట్‌నెస్‌ కోసం, మంచి ఆరోగ్యం కోసం రోజూ కసరత్తులు చేసేవాడు. ఎప్పట్లాగే మంగళవారం కూడా జిమ్ కు వెళ్లాడు. జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. 


పోస్టుమార్టంలో తేలిన కారణం


మంగళవారం ఉదయం 7.30 గంటలకు పృథ్వీ జిమ్ కు వెళ్లాడు. ట్రెడ్‌మిల్ మీద రన్నింగ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఒక్కసారిగా పృథ్వీ కుప్పకూలిపోయాడు. గమనించిన జిమ్ సిబ్బంది, తోటి వారు సాక్షం పృథ్వీని హుటాహుటినా స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పృథ్వీ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. పృథ్వీ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించగా.. షాకింగ్ విషయం బయటపడింది. ట్రెడ్‌మిల్‌ పై రన్నింగ్ చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ కారణంగానే సాక్షం పృథ్వీ కుప్పకూలిపోయాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. 


నిబంధనలు పాటించని జిమ్ మేనేజర్ అరెస్టు


పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. జిమ్ మేనేజర్ అనుభవన్ దుగ్గల్ ను అరెస్టు చేశారు. సాక్షం పృథ్వీ మరణం పై తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. జిమ్ లో పాటించాల్సిన జాగ్రత్తలు, సూచనలు, నిబంధనలు సక్రమంగా పాటించనందువల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించి జిమ్ మేనేజర్ ను అరెస్టు చేశారు. 


జిమ్‌లను ఎంచుకోవడానికి నిపుణుల చిట్కాలు


జిమ్ చేసే వారికి పలు సూచనలు సలహాలు నిపుణులు ఇస్తున్నారు.  చిన్న చిన్న రూమ్‌లో ఉండే జిమ్‌ సెంటర్‌లలో వ్యాయామం చేయొద్దు. ఎందుకంటే వెయిట్‌ లిఫ్టింగ్‌, రన్నింగ్‌, జాగింగ్‌ చేసినప్పుడు మనం వదిలిన గాలినే తిరిగి తీసుకోవాల్సి వస్తుంది. దీంతో బ్లడ్‌లో కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం పెరుగుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బలహీనంగా ఉన్న వారికి ఊపిరితిత్తులు సరిగా పని చేయవు. దీంతో ఒత్తిడి పెరిగి కార్డియాక్ అటాక్‌తో చనిపోయే ఛాన్స్‌ ఉంటుంది.  మెడిసిన్స్‌ వాడుతున్న వారైతే ముఖ్యంగా డాక్టర్ల సూచనల మేరకే జిమ్ చేయాలి. ఇక జిమ్‌ సెంటర్‌లో తప్పనిసరిగా మెడికల్‌ అడ్వైజర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మన సామర్థ్యం మేరకు వ్యాయామం చేయాలి. ఎక్కువ బరువున్న పరికరాలను అస్సలు ఎత్తొద్దు. ఇక వ్యాయామం చేస్తున్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ మాస్క్‌లు ధరించకూడదని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.