Tomato Price: టామాటా ధరలు అన్ని తరగతుల ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపుతున్నాయి. మధ్య తరగతి, పేదలు టమాటాలు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత రెండు నెలలుగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా దాని ప్రభావం అన్ని రకాల వంటలపై పడుతోంది. సామాన్యుడి ఆహార వ్యయాన్ని భారీగా పెంచుతోంది. భోజనాన్ని ఖరీదైనవిగా చేస్తోంది. టమాట ధరలతో పాటు ఇతర నిత్యావసర ధరల పెరుగుల పేద, మధ్య తరగతి ప్రజల నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లకుండా చేస్తున్నాయి.


క్రిసిల్ సంస్థ నివేదిక ప్రకారం నాన్ వెజ్ భోజనం ధరలు 28 శాతం పెరగ్గా, శాఖాహారం ధరలు 11 శాతం పెరిగాయి. నాన్ వెజ్ భోజనం ధరల 28 శాతం పెరడగంలో ప్రధాన భాగం 22 శాతం టమాటా ధరలే కారణం. జూన్‌లో కిలో రూ.33 ఉన్న టమాటా జులైలో ఏకంగా 233 శాతం పెరిగి రూ.110కి చేరింది. టమాటా ధరల పెరుగుదల ఇతర కూరగాయలపై కూడా కనిపించింది. ఉల్లి ధరలు 16% శాతం పెరిగాయి. బంగాళదుంపల ధరలు 9% చొప్పున పెరిగాయి. 


పెరుగుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలు ప్రజలకు తీవ్ర సమస్యగా మారింది. సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. అయితే టమాటా ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా పెద్దగా ఫలితం లేకపోయింది. సరఫరా తగ్గిపోవడం, వాతావరణంలో మార్పులు ఆహార ద్రవ్యోల్బణానికి కారణమవుతున్నాయి. పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది


ఆర్థిక సేవల సంస్థ ఎమ్కే గ్లోబల్ విశ్లేషణ ప్రకారం ఏడాదిలో తృణధాన్యాలు (3.5%), పప్పులు (7.7%), కూరగాయలు (95.1%) పాలు (10.4%) చొప్పున పెరిగాయి. నూనెల ధరలు (-17%) తగ్గాయి. ఆగస్టు చివరి నాటికి టామాటా ధరలు ఎలా ఉంటాయో అంచనా వేయలేమని, కేవలం రెండు వారాల్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని ఎమ్కే గ్లోబల్‌లోని ఆర్థికవేత్త మాధవి అరోరా అన్నారు. 


క్రిసిల్ విశ్లేషణ ప్రకారం.. బ్రాయిలర్ ధరల కారణంగా నాన్ వెజ్ ధరల నెమ్మదిగా పెరగాయి. గతంలో 50% పెరిగిన బ్రాయిలర్ ధరలు జూలై నెలకు 3-5%కి పడిపోయాయి.  మిరపకాయ,  జీలకర్ర కూడా ఖరీదైనవిగా మారాయి. జూలైలో మిర్చి 69%, జీలకర్ర 16% చొప్పున పెరిగాయి. భోజనాల తయారీలో తక్కువగా ఉపయోగించే వాటి ధరలు సైతం పెరిగాయి. కూరగాయల నూనె ధరలో నెలకు 2% తగ్గుదల వెజ్ , నాన్ వెజ్ తాలీ ధరల పెరుగుదల నుంచి కొంత ఉపశమనం కలిగించిందని పేర్కొంది.


ఉత్తర, దక్షిణ, తూర్పు మరియు పశ్చిమ భారతదేశంలోని పలు ప్రదేశాల్లో ఆహారం తయారు చేయడానికి అయ్యే ఖర్చుడలను అక్కడి ధరల ఆధారంగా సగటు ఖర్చు లెక్కించారు.  నెలవారీ ధరల మార్పు సామాన్యుల వ్యయంపై ప్రభావాన్ని చూపుతోంది. క్రిసిల్ ప్రకారం.. సామాన్యుడి ఆహారం వ్యయాన్ని తృణధాన్యాలు, పప్పులు, బ్రాయిలర్‌లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, నూనె, వంట గ్యాస్ కూడా ప్రభావితం చేస్తోంది. 


వెజ్ థాలీలో రోటీ, కూరగాయలు (ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంపలు), బియ్యం, పప్పు, పెరుగు మరియు సలాడ్ ఉంటాయి. మాంసాహార భోజనంలో పప్పుకు బదులుగా చికెన్ ఉంటుంది. జూలై  బ్రాయిలర్ ధరలు మేరకు ఈ అంచనాలు వేశారు.