Donald Trump Tariffs: సుంకాలు తగ్గేదేలే.. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లలో ఏ మార్పు ఉండదన్న అమెరికా వాణిజ్య ప్రతినిధి
USA Tariffs on India: అమెరికా వాణిజ్య ప్రతినిధి ఒప్పందాల ప్రకారం సుంకాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చెప్పారు. ఇతర దేశాలు అమెరికాతో ఎలా పని చేయవచ్చో తెలిపారు.

Donald trump latest tariffs on India | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించిన సుంకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఆగస్టు 1, 2025 గడువులోపు కెనడా, బ్రెజిల్, భారతదేశం, తైవాన్, స్విట్జర్లాండ్ దేశాలపై ట్రంప్ కొత్త టారిఫ్ రేట్లను నిర్ణయించారు. ఈ సమయంలో అమెరికా ట్రేడ్ ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఆదివారం (ఆగస్టు 3, 2025) నాడు ఏ దేశాలపై ట్రంప్ సుంకాలు విధించారో, అందులో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
సుంకాల రేట్లు తగ్గించేది లేదు - జేమిసన్ గ్రీర్
అమెరికా న్యూస్ ఛానల్ సిబిఎస్ నివేదిక ప్రకారం, అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ మాట్లాడుతూ.. చాలా దేశాలతో అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించిన సుంకాలు అలాగే ఉంటాయన్నారు. ట్రంప్ కెనడా నుండి వచ్చే అనేక ఉత్పత్తులపై 35 శాతం, బ్రెజిల్ మీద 50 శాతం, భారతదేశం నుంచి వచ్చే ఉత్పత్తులపై 25 శాతం, తైవాన్ పై 20 శాతం, స్విట్జర్లాండ్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 39 శాతం సుంకాలు విధించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల భారతదేశంపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆ సుంకాలు అములోకి వస్తాయని పేర్కొన్న ట్రంప్ ఆర్డర్స్ మీద సంతకం సైతం చేశారు. సుంకాలు విధిస్తున్న సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అని అన్నారు. భారతదేశం చెబుతున్న దాని ప్రకారం, ఇంకా వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి. ట్రేడ్ డీల్ సంబంధించి అమెరికా ప్రతినిధి బృందం ఈ నెలలో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉంది.
'ఒప్పందాల ప్రకారం సుంకాల రేట్లు నిర్ణయం'
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు జేమిసన్ గ్రీర్ మాట్లాడుతూ.. 70 దేశాలపై సుంకాల రేట్లు పెరిగాయి. రాబోయే రోజుల్లో సుంకాల రేట్లపై చర్చలు జరిపి వాటిని తగ్గిస్తారా అని అడగ్గా, "అలాంటిదేమీ లేదు, రాబోయే రోజుల్లో అలా ఏం జరగదు. ప్రస్తుతం ట్రంప్ నిర్ణయించిన రేట్లు ఒప్పందాల ప్రకారం ఉన్నాయి. చాలా దేశాల మంత్రులు నాతో దీని గురించి మాట్లాడాలని భావించారు. వారు అమెరికాతో ఎలా భిన్నంగా పని చేయగలరు. ట్రంప్ టారిఫ్ లకు అనుగుణంగా నడుచుకోవడం తప్ప మరో మార్గం లేదు"
'చైనాతో చర్చలు సానుకూలంగా ఉన్నాయి'
జేమిసన్ గ్రీర్ మాట్లాడుతూ.. ఇటీవల చైనాతో వాణిజ్య ఒప్పందం (US China Trade Deal)పై సానుకూల చర్చలు జరిగాయి. "మేము సిబ్బంది స్థాయిలో, నా స్థాయిలో, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరిగాయి. మేము కొన్ని సాంకేతిక సమస్యలపై పని చేస్తున్నాము. త్వరలోనే వీటికి సంబంధించి టారిఫ్ ప్రకటిస్తాం" అన్నారు.






















