Underwater Twin tube Road Rail Tunnel: దేశంలో తొలి ట్విన్-ట్యూబ్ అండర్ వాటర్ టన్నెల్.. 6 గంటల జర్నీ 20 నిమిషాల్లోనే- పూర్తి ప్రయోజనాలు ఇవే
దేశంలో తొలి ట్విన్-ట్యూబ్ అండర్ వాటర్ టన్నెల్ నిర్మించనున్నారు. అస్సాంలోని గోహ్‌పూర్, నుమాలిఘర్ మధ్య బ్రహ్మపుత్ర నది కింద రైలు, రోడ్డు సొరంగం నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Tunnel between Gohpur and Numaligarh | న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శనివారం (ఫిబ్రవరి 14) నాడు దేశంలోనే అత్యంత కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. బ్రహ్మపుత్ర నది కింద గోహ్‌పూర్, నుమాలిగఢ్ మధ్య రైలు, రోడ్డు టన్నెల్ (Twin-tube Road Rail tunnel )ను నిర్మించడానికి ప్రధాని మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ₹18,662 కోట్లతో నిర్మించే ఈ అండర్ వాటర్ ట్విన్ ట్యూబ్ రోడ్డు, రైలు టన్నెల్ పూర్తయితే 240 కిలోమీటర్ల దూరం కేవలం 34 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. బ్రహ్మపుత్ర నది కింద 15.8 కిలోమీటర్ల మేర ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్‌ను నిర్మించడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 
దేశంలో తొలి ట్విన్ ట్యూబ్ అండర్ వాటల్ టన్నెల్
దేశంలోనే మొదటిసారిగా ఇటువంటి ట్విన్-ట్యూబ్ అండర్ వాటర్ టన్నెల్ భారత ప్రభుత్వం నిర్మించబోతోంది. ఈ టన్నెల్‌లో రోడ్డు మార్గంలో వాహనాలు, పట్టాలపై రైళ్లు రెండూ నడిచే సౌకర్యం ఉంది. దీనివల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు సైన్యం, మందుగుండు సామాగ్రిని సైతం వేగంగా తరలించడానికి అవకాశం ఉంటుంది. ఒక ట్యూబ్‌లో సింగిల్ రైల్ ట్రాక్ సౌకర్యం ఉంటుంది.

టన్నెల్ డిజైన్ ఎలా ఉంటుంది?
కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకారం, ఈ టన్నెల్ నుండి రైళ్లు, వాహనాలు ఒకే సమయంలో వెళ్లేలా దీనిని డిజైన్ చేస్తారు. ఇందులో బ్యాలస్ట్ ట్రాక్ ఉంటుంది. రైళ్లు విద్యుత్తుతో నడుస్తాయి. టన్నెల్, అప్రోచ్ రోడ్, రైల్వే ట్రాక్ కలిపి మొత్తం 33.7 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 18,600 కోట్ల ఖర్చు కానుంది. ఈ ప్రాజెక్ట్ ఖర్చును రోడ్డు రవాణా, రైల్వే, రక్షణ మంత్రిత్వ శాఖలు కలిసి భరించనున్నాయని పేర్కొన్నారు.

గంటల ప్రయాణం ఇప్పుడు నిమిషాల్లోనే
2 లైన్లుగా ట్విన్ ట్యూబ్ రొడ్డు, రైలు మార్గాలుగా డిజైన్ చేసిన ఈ సొరంగాలను బ్రహ్మపుత్ర నదిలో 32 మీటర్ల కింద నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ 5 ఏళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత, గోహ్‌పూర్, నుమాలిగఢ్ మధ్య ప్రయాణ సమయం 6 గంటల నుండి కేవలం 20 నిమిషాలకు తగ్గుతుంది. దూరం 240 కిలోమీటర్ల నుండి కేవలం 34 కిలోమీటర్లకు తగ్గడంతో ఇది ఆర్మీకి సైతం ఎంతో కీలకంగా మారనుంది.
Cabinet approves India’s first Underwater twin-tube road rail tunnel under River Brahmaputra
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 14, 2026
🚇 4-lane tunnel | Gohpur - Numaligarh, Assam (34 km | ₹18,662 Cr)
➡️ Strengthens the North-East as a gateway to the Act East policy
➡️ Distance reduced from 240 km to 34 km; travel… pic.twitter.com/u8Cmj1bOmk
ఈశాన్య భారత్ కు భారీ కానుక
ఈ అండర్ వాటర్ ట్విన్ ట్యూబ్ టన్నెల్ పూర్తయిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, ఇతర ఈశాన్య రాష్ట్రాలతో కనెక్టివిటీ మెరుగుపడుతుంది. గత ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రక్షణ మంత్రిత్వ శాఖల ద్వారా 80:20 నిధుల వాటాతో దాదాపు రూ. 14,900 కోట్ల వ్యయంతో ఈ సొరంగం నిర్మాణానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.

గౌహ్పూర్ - నుమలిగఢ్ మధ్య ట్విన్ ట్యూబ్ టన్నెల్ హైలైట్స్..
- 'ఆక్ట్ ఈస్ట్ పాలసీ' కోసం ఈశాన్యాన్ని గేట్‌వేగా అభివృద్ధి చేయడంలో మైలురాయి
- బ్రహ్మపుత్ర నది కింద టన్నెల్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
- గౌహ్పూర్ - నుమలిగఢ్ (అస్సాం)ను అనుసంధానం చేస్తుంది
- 4 లేన్ అండర్‌వాటర్ టన్నెల్
- టన్నెల్ పొడవు: 15.8 కి.మీ
- ట్విన్ ట్యూబ్స్: రెండు సమాంతర టన్నెళ్లు రోడ్ + రైల్
- భారత్‌లో తొలి అండర్‌వాటర్ ట్విన్ ట్యూబ్ రోడ్ కమ్ రైల్ టన్నెల్
- జిల్లాలు: గొలాఘాట్, బిస్వనాథ్ (అస్సాం)
- ప్రాజెక్ట్ పొడవు: 34 కి.మీ
- మొత్తం ఖర్చు: రూ. 18,662 కోట్లు
- నిర్మాణ కాలం: 5 సంవత్సరాలు
- గౌహ్పూర్, నుమలిగఢ్ మధ్య దూరాన్ని 240 కి.మీ నుంచి 34 కి.మీకి తగ్గిస్తుంది
- ప్రయాణ సమయం 6 గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గుతుంది
- సగటు వేగంలో 100 శాతం పెరుగుదల
- అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లకు అధిక వేగంతో కనెక్టివిటీ
- ఈశాన్యంలో పర్యాటకాన్ని పెంచుతుంది
- సరిహద్దు కనెక్టివిటీ, క్రాస్-బార్డర్ వాణిజ్యం మెరుగవుతుంది
- ఉపాధి: 80 లక్షల పని రోజులతో కార్మికులకు ఉపాధి
























