Bhopal Model Death Case:   భోపాల్‌లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ  మృతి కేసులో ఎట్టకేలకు ప్రధాన నిందితుడు, ఆమె భర్త  సమర్థ్ సింగ్ పోలీసులకు దొరికిపోయారు. కోర్టులో లొంగిపోయిన అతడిని భోపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

Continues below advertisement

కలల నగరం నుంచి కలత వైపు.. 

ట్విషా శర్మ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గుర్తింపు పొందిన మోడల్. గ్లామర్ రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకోవాలని కలలు కన్న ఆమెకు,  సమర్థ్ సింగ్  అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో 2023లో వీరిద్దరూ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ, ఆ వైభవం కొన్ని నెలలకే ఆవిరైపోయింది.

Continues below advertisement

  పెళ్లంటే  వేధింపుల  కాపురం? 

పెళ్లయిన కొద్దిరోజులకే సమర్థ్ అసలు రంగు బయటపడింది. ట్విషా మోడలింగ్ వృత్తిని అతడు ద్వేషించేవాడు. ఆమె ఫోన్ చెక్ చేయడం, బయటకు వెళ్లనివ్వకుండా కట్టడి చేయడం, చిన్న విషయానికే కొట్టడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. సమర్థ్ కుటుంబ సభ్యులు సైతం అదనపు కట్నం కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టారు.  ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే నరకం చూపిస్తున్నాడని ట్విషా తన స్నేహితుల వద్ద కన్నీరు మున్నీరైనట్లు పోలీసు విచారణలో తేలింది.   

 మరణం మిగిల్చిన ప్రశ్నలు 

గత ఏప్రిల్ నెలలో ట్విషా శర్మ భోపాల్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా భావించినప్పటికీ, ఆమె ఒంటిపై ఉన్న గాయాలు, అపార్ట్‌మెంట్‌లో చిందరవందరగా ఉన్న వస్తువులు అనేక అనుమానాలకు తావిచ్చాయి. ట్విషా ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను చంపి ఫ్యాన్‌కు వేలాడదీశారని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

 సమర్థ్ అదృశ్యం - పోలీసుల గాలింపు 

ట్విషా మరణించినప్పటి నుండి భర్త సమర్థ్ సింగ్ కనిపించకుండా పోయాడు. పోలీసులు నిందితుడి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతడు విదేశాలకు పారిపోకుండా ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేశారు. రెండు నెలల పాటు వేర్వేరు నగరాల్లో మారువేషంలో తిరుగుతూ పోలీసులకు చుక్కలు చూపించాడు సమర్థ్. అతడి ఆచూకీ తెలిపిన వారికి రివార్డు కూడా ప్రకటించారు. పోలీసులు చుట్టుముడుతున్నారని గ్రహించిన సమర్థ్ సింగ్, శనివారం అనూహ్యంగా కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అతడిని భోపాల్ పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. ప్రస్తుతం అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ట్విషా రాసినట్లుగా భావిస్తున్న ఒక  డైరీ  ఇప్పుడు ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. అందులో సమర్థ్ తనపై చేసిన చిత్రహింసలను ఆమె పూసగుచ్చినట్లు రాసినట్లు తెలుస్తోంది.  సమర్థ్ సింగ్ అరెస్టుతో ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. అతడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, ట్విషా మరణించిన రోజు రాత్రి అసలు ఏం జరిగింది? వారి మధ్య గొడవకు కారణమేంటి? ఆమెను ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్తు ఉన్న ట్విషా శర్మ జీవితం ఇలా విషాదాంతం కావడం భోపాల్ వాసులను కలచివేసింది.