Breaking News: ఏపీ రైతులకు అలర్ట్: రేపటి నుంచి APAIMS యాప్ ద్వారా ఎరువుల పంపిణీ!
Top Stories Today | జూన్ 7న ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, సినీ, క్రీడా ఇతర రంగాల అప్‌డేట్స్ ఇక్కడ అందిస్తున్నాం. పేజీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Top Stories Today |
ఏపీ రైతులకు అలర్ట్: రేపటి నుంచి APAIMS యాప్ ద్వారా ఎరువుల పంపిణీ!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని (26) జిల్లాల్లో APAIMS యాప్ ద్వారా యూరియా, డీఏపీ (DAP) ఎరువుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అరికట్టి, అర్హులైన రైతులకు సక్రమంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని తీసుకువచ్చింది.
చేప ప్రసాదం పంపిణీ వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. హైదరాబాద్ పోలీసుల కీలక విజ్ఞప్తి!
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ దృష్ట్యా సోమవారం ఉదయం 6 నుండి మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. నాంపల్లి వైపు వచ్చే ప్రయాణికులు ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా ఉండేందుకు ముందే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో స్కూళ్ల రీఓపెనింగ్ తేదీని పొడిగిస్తూ నిర్ణయం
తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం తేదీలో స్వల్ప మార్పు జరిగింది. రాష్ట్రంలో స్కూళ్లను ఈనెల 12వ తేదీకి బదులుగా, జూన్ 15 నుండి తెరవనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఆ తర్వాత శని, ఆదివారాలు (వారాంతపు సెలవులు) వస్తుండటాన్ని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ.. విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం రీఓపెనింగ్ తేదీని పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈనెల 15 (సోమవారం) నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
మూడేళ్ల తర్వాత స్వదేశానికి సురక్షితంగా ఒడిశా మహిళ!
దుబాయ్‌లోని భారత కాన్సులేట్, యూఏఈ అధికారుల సంయుక్త కృషితో ఒడిశాకు చెందిన హస్తా మహానంద ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకుంది. ఆమెను తిరిగి సొంత ఇంటికి చేర్చడంలో విదేశాల్లోని భారత రాయబార కార్యాలయం కీలక పాత్ర పోషించింది.
హస్తా మహానంద 2019 నుండి ఉపాధి కోసం యూఏఈ (UAE)లో పని చేస్తోంది. అయితే, గత మూడేళ్ల క్రితం ఆమె తన కుటుంబంతో పూర్తిగా సంబంధాలు కోల్పోయింది. ఆమె ఎక్కడుందో, ఎలా ఉందో తెలియకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సాయం చేయాలంటూ భారత అధికారులను ఆశ్రయించారు.
కుటుంబ సభ్యుల విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టింది. యూఏఈ స్థానిక అధికారుల సహకారంతో ఆమెను గుర్తించి, అవసరమైన ప్రయాణ పత్రాలను సిద్ధం చేసి సురక్షితంగా ఆమె ఇంటికి చేర్చింది. మూడేళ్ల తర్వాత తమ మనిషి క్షేమంగా తిరిగి రావడంతో ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు.. 564/8 వద్ద డిక్లేర్
ఇండియా, అఫ్గానిస్తాన్ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ఆసక్తికరంగా సాగింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 564/8 వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126), ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) సెంచరీలతో చెలరేగగ, రిషభ్ పంత్, సాయి సుదర్శన్ చెరో 81 రన్స్ చేశారు. వాషింగ్టన్ సుందర్ (52) నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గానిస్తాన్ రెండో రోజు 15 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.
యూజీసీ నెట్ జూన్ షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ (UGC NET) జూన్ 2026 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జూన్ 22 నుండి జూన్ 30 వరకు జరగనున్నాయి. మొత్తం 5 రోజుల పాటు 80కి పైగా సబ్జెక్టులకు ప్రతిరోజూ 2 షిఫ్టుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. పరీక్షకు సంబంధించిన సిటీ ఎగ్జామ్ సెంటర్ వివరాలను 8 నుండి 10 రోజుల ముందే ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. దీని ప్రకారం, జూన్ 22న పరీక్ష రాసే అభ్యర్థులు జూన్ 12 నుండి 14 లోపు తమ సిటీ కేటాయింపు వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని కేకే ఓపెన్ కాస్ట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వెళ్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఒకే ఒక్క ప్రయాణికుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఆ ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ ముందు భాగం నుజ్జునుజ్జయింది.

డ్రైవర్ సహా ఓ ప్రయాణికుడికి ఎలాంటి ప్రాణ నష్టం కాకపోవడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై బస్సు బోల్తా పడటంతో గంట పాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆ తరువాత పోలీసులు బస్సును క్రేన్ సహాయంతో పక్కకు జరిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
సామాన్యుడిపై మరోసారి ధరల భారం: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతల ప్రభావంతో భారత్‌లో సామాన్యులపై మరోసారి ధరల భారం పడింది. చమురు కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 మేర పెంచాయి. మూడు నెలల వ్యవధిలో గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. జూన్ 7 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పెంపుతో ఢిల్లీలో 14 కేజీల సిలిండర్ ధర రూ.913 నుండి రూ.942కు, హైదరాబాద్‌లో రూ.965 నుండి రూ.994కు చేరింది.
వ్యాపార అవసరాల కోసం వాడే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరలు కూడా గత నాలుగు నెలలుగా నిరంతరం పెరుగుతున్నాయి. ముఖ్యంగా జనవరి నెలలోనే కమర్షియల్ సిలిండర్ ధరపై అత్యధికంగా రూ.111 చొప్పున పెంచారు. ఇలా అటు డొమెస్టిక్, ఇటు కమర్షియల్ సిలిండర్ల ధరలు వరుసగా పెరుగుతుండటంతో అటు సామాన్యుల వంటగది బడ్జెట్‌పై, ఇటు వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఏపీ రాజ్యసభ ఎన్నికలు: అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచే తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కొలిక్కి తెచ్చింది. పార్టీ తరఫున పోటీ చేయబోయే ముగ్గురు అభ్యర్థులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీశ్, చింతకాయల విజయ్‌ల పేర్లను శనివారం ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపికలో సోషల్ బ్యాలెన్స్ పాటించడంతో పాటు, పార్టీ పట్ల ఉన్న అంకితభావం, యువతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలకు పెద్దపీట వేసినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ముగ్గురు అభ్యర్థులు సోమవారం (జూన్ 8న) తమ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న మొత్తం 4 రాజ్యసభ స్థానాలకు గాను, కూటమి పొత్తుల ఒప్పందంలో భాగంగా టీడీపీ 3 స్థానాలను, జనసేన పార్టీ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇందులో జనసేన కోటాకు కేటాయించిన స్థానంలో ఆ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఇప్పటికే తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా ఆరుగురు జనసేన ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి ఇదివరకే తమ పూర్తి మద్దతును ప్రకటించారు.
ట్రెండింగ్ వార్తలు























