Toll Plaza Income In India | న్యూఢిల్లీ: భారతదేశంలో రోడ్లు, రహదారుల విస్తరణ ఎంత వేగంగా జరుగుతుందో, టోల్ ప్లాజాల ద్వారా సమకూరే ఆదాయం కూడా అదే వేగంతో పెరుగుతోంది. జాతీయ రహదారులు లేదా ఎక్స్‌ప్రెస్‌వేల నుంచి ప్రయాణించేటప్పుడు, మనం చెల్లించే టోల్ టాక్స్ రహదారుల నిర్మాణం, నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడతాయి. టోల్ ప్లాజా నుంచి వెళ్లినప్పుడు ప్రతిసారి వీళ్లకు డైలీ ఎంత ఆదాయం వస్తుందో అని ఆలోచిస్తుంటారు వాహనదారులు. అయితే దేశ వ్యా్ప్తంగా మొత్తం ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నాయి, వాటి ఎంత ఆదాయం సమకూరుతుందో లెక్కలు తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. 

భారత్‌లో మొత్తం ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నాయి?రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశంలో 2025 జూన్ నాటికి మొత్తం 1,087 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇవి 1.5 లక్షల కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులలో ఏర్పాటై ఉన్నాయి. ఇందులో సుమారు 45,000 కిలోమీటర్ల మేర వాహనదారుల నుంచి టోల్ వసూలు జరుగుతోంది. టోల్ ప్లాజా నెట్‌వర్క్‌లో భాగంగా గత ఐదేళ్లలో కొత్తగా నిర్మించిన 457 టోల్ గేట్స్ సైతం ఉన్నాయి. వాహనదారుల సౌలభ్యం కోసం ఫాస్టాగ్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వలన ఈ విస్తరణ మరింత వేగంగా జరిగింది.

టోల్ ప్లాజాల ద్వారా వచ్చే ఆదాయం ఎంత?లోక్‌సభలో సమర్పించిన లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం 1,087 టోల్ ప్లాజాల ద్వారా ప్రతి రోజూ సగటున రూ. 168.24 కోట్ల ఆదాయం వస్తోంది. ఇది సంవత్సరానికి దాదాపు రూ. 61,408 కోట్లు అవుతుంది. ఫాస్టాగ్ అమలులోకి రావడం వల్ల టోల్ ప్లాజాల వద్ద వసూళ్లలో పారదర్శకత మరింత పెరిగింది. 2019-20లో రూ. 27,504 కోట్లుగా ఉన్న ఆదాయం, 2023-24 నాటికి రూ. 55,882 కోట్లకు చేరింది. గత 5 సంవత్సరాల్లో వసూలు చేసిన టోల్ ఫీజుల విలువ రూ. 1.93 లక్షల కోట్లు అని అధికారిక సమాచారం.

అత్యధిక ఆదాయం అందించే టోల్ ప్లాజాలు ఏవి?

దేశంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే టోల్ ప్లాజా గుజరాత్‌లోని వడోదర-భరూచ్ విభాగంలో ఉన్న భరత్నా టోల్ ప్లాజా నిలిచింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023-24లో ఈ టోల్ ప్లాజా ఒక్కటే రూ. 472.65 కోట్లు ఆర్జించింది. దీని తరువాత వరుస స్థానాల్లో రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్ టోల్ ప్లాజా, పశ్చిమ బెంగాల్‌లోని జలధులాగోరి టోల్ ప్లాజా ఉన్నాయి. 4వ స్థానంలో ఉత్తరప్రదేశ్‌లోని బడాజోర్, ఐదవ స్థానంలో హర్యానాలోని ఘరౌండా టోల్ ప్లాజా ఉన్నాయి.

ఆదాయంలో టాప్ 5 టోల్ ప్లాజాలు

భరత్నా టోల్ ప్లాజా, గుజరాత్‌షాజహాన్‌పూర్, రాజస్థాన్జలధులాగోరి, పశ్చిమ బెంగాల్బడాజోర్, ఉత్తరప్రదేశ్ఘరౌండా, హర్యానా