Goa Liberation: భారత దేశానికి 1947 ఆగష్టు 15వ తేదీన స్వాతంత్య్రం వచ్చిందన్న విషయం మనకు తెలుసు. కానీ మన దేశంలో కొన్ని సంస్థానాలకు మాత్రం ఆ రోజు స్వాతంత్య్రం సంబరాలు చేసుకునే అవకాశం లేకపోయింది. అలాంటి ప్రాంతాల్లో హైదరాబాద్ రాష్ట్రం ఒకటి కాగా, మరో ప్రాంతం గోవా. అయితే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశమంతా బ్రిటీష్ పాలనలో లేదు. హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలకుల ఆధీనంలో ఉన్నట్లు, గోవా ప్రాంతం పోర్చుగీసు పాలనలో ఉంది. బ్రిటీష్ వారు భారత దేశాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నా, పోర్చుగీసు వారు మాత్రం గోవాను విడిచి వెళ్లడానికి ఇష్టపడలేదు. భారత దేశానికి స్వాతంత్య్ర సిద్ధించినా, గోవా 14 ఏళ్లపాటు పోర్చుగీసు పాలనలో ఉండిపోయింది. అయితే గోవా 1961లో సరిగ్గా ఇదే రోజు, అంటే డిసెంబర్ 19వ తేదీన భారత దేశంలో విలీనం అయింది. గోవా విలీనం ఆలస్యం వెనుక దాగిన వాస్తవాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

Continues below advertisement

భారత దేశంలో గోవా విలీనం అవ్వకుండా ఆలస్యం అవ్వడానికి గల ప్రధాన కారణాలు ఇవే

1. గోవా వదిలి వెళ్లకుండా మొండికేసిన పోర్చుగీసు

బ్రిటిష్ వారు 1947 ఆగష్టు 15వ తేదీన భారతదేశాన్ని విడిచి వెళ్ళినప్పటికీ, పోర్చుగీసు వారు గోవాను వదిలి వెళ్ళడానికి నిరాకరించారు. అప్పటి పోర్చుగల్ నియంత ఆంటోనియో సాలజర్, గోవాను కేవలం ఒక కాలనీగా కాకుండా, పోర్చుగల్‌లో అంతర్భాగమైన ఒక "విదేశీ ప్రావిన్స్" (Overseas Province) గా ప్రకటించారు. దీనివల్ల గోవాపై తమకు శాశ్వత హక్కు ఉందని వారు వాదించారు. ఈ కారణంగా గోవా భారత్‌లో విలీనం అవ్వడానికి ఆలస్యం అయింది.

Continues below advertisement

2. అంతర్జాతీయ రాజకీయాలు - NATOలో పోర్చుగీసు భాగస్వామి కావడం

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయాల కారణంగా, నాటి భారత ప్రభుత్వం గోవాను విలీనం చేసుకోవడంలో కొంత ఆలోచించాల్సి వచ్చింది. ఆ సమయంలో పోర్చుగల్ దేశం NATO (North Atlantic Treaty Organization) లో సభ్యత్వం కలిగి ఉంది. ఒకవేళ భారత్ గోవాపై సైనిక చర్యకు దిగితే, పోర్చుగల్‌కు మద్దతుగా అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాలు ఈ విషయంలో జోక్యం చేసుకుంటాయేమోనని అప్పట్లో భారత ప్రభుత్వం ఆందోళన చెందింది. ఒకవేళ బలప్రయోగానికి దిగితే మొదటికే మోసం వస్తుందేమో, ఇతర దేశాల జోక్యంతో ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుందన్న భయం ఒక కారణమని చెప్పవచ్చు.

3. నెహ్రూ దౌత్య విధానం (Diplomacy)

గోవా విముక్తి ఆలస్యం అవ్వడానికి నాటి భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ విదేశాంగ విధానం మరో కారణంగా చెప్పవచ్చు. అప్పుడే స్వాతంత్ర్యం పొందిన భారత దేశం అహింసా మార్గంలోనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని నెహ్రూ భావించారు. దాదాపు 14 ఏళ్ల పాటు పోర్చుగీసు వారితో భారత ప్రభుత్వం శాంతియుత చర్చలు జరిపింది. కానీ పోర్చుగల్ ప్రభుత్వం అసలు అంగీకరించకపోవడంతో గోవా భారత్‌లో విలీనం కావడం ఆలస్యమయింది.

4. దేశ విభజన నాటి మత కల్లోలాలు

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే, 1947లోనే పాకిస్థాన్ మన దేశం నుంచి మత ప్రాతిపదికన విడిపోయింది. ఆ సందర్భంగా మతకల్లోలాలు రేగడం, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ - భారత్ మధ్య ఘర్షణలు వంటి అంశాల కారణంగా భారత ప్రభుత్వం గోవాపై సైనిక చర్యకు వెనుకాడింది. ఈ కారణాలు కూడా గోవా మన దేశంలో విలీనానికి జాప్యం కలిగించాయి.

5. గోవా విముక్తి పోరాటాలను అణిచివేసిన పోర్చుగల్

గోవా భారత్‌లో కలవాలని డిమాండ్ చేస్తూ కొద్ది మంది ఉద్యమకారులు శాంతియుత నిరసనలు ఆనాడు చేపట్టారు. అయితే 1955లో జరిగిన సత్యాగ్రహ పోరాటంలో పోర్చుగీసు సైన్యం ఈ ఉద్యమకారులపై కాల్పులు జరిపింది. చాలా మంది భారతీయులు ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల తర్వాత భారత దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో నాటి భారత ప్రభుత్వం ఈ చర్యను తీవ్రంగా తీసుకుని గోవా విలీనంపై గట్టిగా దృష్టి పెట్టింది.

ఆపరేషన్ విజయ్‌తో గోవాకు విముక్తి

చర్చలు, దౌత్య ప్రయత్నాలు పూర్తిగా విఫలమవ్వడంతో నెహ్రూ ప్రభుత్వం గోవా విలీనంపై సైనిక చర్యకు మొగ్గు చూపింది. 1961 డిసెంబర్ 17-18 తేదీలలో భారత సైన్యం, నావికాదళం, వాయుసేనలు గోవాపై దాడి చేశాయి. దీనికి 'ఆపరేషన్ విజయ్' గా నామకరణం చేశారు. భారత సైన్యపు చర్యకు కేవలం 36 గంటల్లోనే పోర్చుగీసు సైన్యం లొంగిపోయింది. 1961 డిసెంబర్ 19న గోవా అధికారికంగా భారతదేశంలో విలీనమైంది. అందుకే ప్రతి ఏటా డిసెంబర్ 19వ తేదీని "గోవా విముక్తి దినోత్సవం" (Goa Liberation Day)గా జరుపుకుంటారు.