Kerala Assembly elections Three-way contest: కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026 సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయ వాతావరణం అత్యంత ఆసక్తికరంగా మారింది. వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పోరాడుతుంటే, ఈసారి ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రం వ్యూహాలు రచిస్తోంది. తన ఉనికిని బలంగా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
యూడీఎఫ్ కు బూస్ట్ ఇచ్చిన స్థానిక ఎన్నికల ఫలితాలు
కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్స్‌గా నిలిచాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 38.8 శాతం ఓట్లతో మున్సిపాలిటీలు , పంచాయతీలను కైవసం చేసుకుని అధికార ఎల్డీఎఫ్ కు గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఎల్డీఎఫ్ కంచుకోటలుగా భావించే కన్నూర్, కొచ్చి వంటి నగరాల్లో కూడా కాంగ్రెస్ కూటమి పాగా వేయడం ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో తాము విజయం సాధించామని యూడీఎఫ్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్న ప్రజల మద్దతు తమకే ఉందని వి.డి. సతీశన్ వంటి కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. అయితే ఇదే సమయంలో సీనియర్ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పినరయి విజయన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన అంచనా వేయడం సొంత పార్టీలోనే విస్మయం కలిగించింది. అయినప్పటికీ, మైనారిటీ ఓట్లు , రైతుల మద్దతును కూడగట్టడం ద్వారా 2026లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది.
మునుపెన్నడూ లేని విధంగా పుంజుకున్న బీజేపీ
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సాధించిన విజయాలు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ మొదటిసారి అతిపెద్ద కూటమిగా అవతరించి చరిత్ర సృష్టించింది. దాదాపు 45 ఏళ్ల లెఫ్ట్ పాలనకు ముగింపు పలికి 50 వార్డులను దక్కించుకోవడం ద్వారా బీజేపీ కేరళలో మూడో శక్తిగా ఎదిగింది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో కూడా బీజేపీ ఓట్ల శాతం పెరగడం ఈసారి కేరళలో ముక్కోణపు పోటీ ఖాయమనే సంకేతాలను ఇస్తోంది.
ఎల్డీఎఫ్ మళ్లీ గెలుస్తుందా?
వరుసగా రెండుసార్లు విజయం సాధించి రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఈ సారి కూడా ఎల్డీఎఫ్ కే విజయం వరిస్తుందని భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎదురైన పరాజయాలను విశ్లేషించుకుని, తప్పులను సరిదిద్దుకుంటామని ఎల్డీఎఫ్ కన్వీనర్ ప్రకటించారు. ముఖ్యంగా సామాజిక పింఛన్ల పెంపు, ఉచిత విద్య వంటి ప్రజాకర్షక పథకాలను ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రవేశపెట్టి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే అవినీతి ఆరోపణలు, కే-రైల్ ప్రాజెక్టుపై నిరసనలు ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ప్రజా సమస్యలే అజెండాగా ఎన్నికల కురుక్షేత్రం
రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు ,మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన అంశాలుగా మారనున్నాయి. కేరళ ఓటర్లు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని 2021లో ఎల్డీఎఫ్ బ్రేక్ చేసింది. ఇప్పుడు 2026లో మళ్లీ అదే సంప్రదాయం కొనసాగుతుందా లేక పినరయి విజయన్ హ్యాట్రిక్ కొడతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బీజేపీ చీల్చే ఓట్లు ఏ పార్టీకి నష్టం కలిగిస్తాయి అనే దానిపైనే రాష్ట్ర అధికార పీఠం ఎవరిదనేది ఆధారపడి ఉంటుంది.