మానవ అక్రమ రవాణా ( Human Trafficking)ను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ప్రమేయమున్న వ్యక్తులను గుర్తించడమే లక్ష్యంగా ఎన్‌ఐఏ (NIA) దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. మానవ అక్రమ రవాణాతో సంబంధమున్న 44 మంది వ్యక్తులను అరెస్టు చేసింది. బీఎస్‌ఎఫ్, ఆయా రాష్ట్ర పోలీసుల సహకారంతో పది రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో మొబైల్ ఫోన్‌లు, సిమ్‌ కార్డ్‌లు, పెన్ డ్రైవ్‌లు వంటి డిజిటల్ పరికరాలతో పాటు 20లక్షల నగదును స్వాధీనం చేసుకొంది. మానవ అక్రమ రవాణా కేసుతో సంబంధం ఉన్న మయన్మార్‌కు చెందిన వ్యక్తిని జమ్మూలో ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. 


దేశవ్యాప్తంగా 55 ప్రాంతాల్లో గాలింపు
ఇండో-బంగ్లాదేశ్‌ సరిహద్దు ద్వారా దేశంలోకి వలసదారులకు ప్రవేశం కల్పిస్తూ కొన్ని ముఠాలు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. ఈ ముఠాలను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. అసోం రాజధాని గౌహతి, చెన్నై, బెంగళూరు, జైపురలోని ఎన్‌ఐఏ విభాగాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగానే 55 ప్రాంతాల్లో నిందితుల కోసం గాలించింది. త్రిపుర, అసోం, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, హర్యాణా, రాజస్థాన్‌ తో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్‌, పుదుచ్చేరిల్లో ఉదయం అర్ధరాత్రి వరకు ఎన్ఐఏ విస్తృతంగా సోదాలు చేసింది. 


అసోంలో తొలి కేసు వెలుగులోకి
అసోం పోలీస్‌ విభాగానికి చెందిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సెప్టెంబరు 9న తొలికేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావడంతో ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. సరిహద్దు ప్రాంతాల్లో సహా అనేక రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో మొబైల్ ఫోన్‌లు, సిమ్‌ కార్డ్‌లు, పెన్ డ్రైవ్‌లు వంటి డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకొంది. ఆధార్, పాన్ సహా పలు నకిలీ గుర్తింపు పత్రాలు నిందితుల వద్ద ఉన్నట్లు గుర్తించింది. 20 లక్షల నగదు, 4550 డాలర్లను సీజ్‌ చేసింది. అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఛేదించడానికి కొత్తగా మూడు కేసులు నమోదు చేసింది. త్రిపురలో-21 మంది, కర్ణాటకలో-10 మంది, అసోంలో ఐదుగురు, పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురు, తమిళనాడులో ఇద్దరు, పుదుచ్చేరి, తెలంగాణ, హర్యాణాలో ఒకర్ని చొప్పున అరెస్టు చేసింది. 


జమ్మూకశ్మీర్ రోహిత్య ముస్లిం అరెస్ట్
జమ్మూ కశ్మీర్‌లో నిర్వహించిన సోదాల్లో మయన్మార్‌కు చెందిన రోహింగ్యా ముస్లిం జాఫర్‌ అలామ్‌ను, బథిండి ప్రాంతంలో ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడితోపాటు ఉన్న మరో నిందితుడు పరారైనట్లు అధికారులు తెలిపారు. మయన్మార్‌ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలు నివసిస్తున్న ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. గత నెలలో శ్రీలంకకు చెందిన పలువురిని తమిళనాడు మీదుగా బెంగళూరు, మంగళూరుకు అక్రమంగా తరలించిన కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌ అనే వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు.