Technical Snag In PM Modi Aircraft: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రయాణించాల్సిన ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఝార్ఖండ్‌లో (Jharkhand) పర్యటించారు. క్యాంపెయిన్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో ఢిల్లీకి (Delhi) తిరుగు ప్రయాణం ఆలస్యమైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఎన్నికల ప్రచారం నిమిత్తం శుక్రవారం ఉదయం ప్రధాని ఝార్ఖండ్‌లో పర్యటించారు. 2 ప్రాంతాల్లో ర్యాలీల్లో పాల్గొన్నారు. బిర్సాముండా జయంతి సందర్భంగా పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. పర్యటన ముగిసిన అనంతరం ఢిల్లీ తిరిగి వెళ్లేందుకు దేవ్‌గఢ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే, ప్రధాని ప్రయాణించాల్సిన ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ కాలేదు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.
రాహుల్ హెలికాఫ్టర్ సైతం
మరోవైపు, ఝార్ఖండ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ సైతం గంటకు పైగా నిలిచిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాకపోవడంతో దేవఘర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని గోడ్డాలో ఆగిపోయింది. దీంతో ఆయన పర్యటన షెడ్యూల్‌కు ఆటంకం కలిగింది. కాగా, ఝార్ఖండ్‌లో ఈ నెల 13న తొలి విడత పోలింగ్ జరిగింది. ఈ నెల 20న మహారాష్ట్రతో పాటు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23న ఫలితాలు వెల్లడించనున్నారు.
అమిత్ షా హెలికాఫ్టర్‌లో తనిఖీలు
అటు, మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనేందుకు వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాఫ్టర్‌ను అధికారులు తనిఖీ చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడిస్తూ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశారు. 'ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడకు వచ్చిన క్రమంలో నా హెలికాఫ్టర్‌ను అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తోంది. ఇందుకు మనమంతా సహకరించాలి. ప్రపంచంలో శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్‌ను కొనసాగించడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి.' అని అమిత్ షా పేర్కొన్నారు.
Also Read: Karnataka News: కర్ణాటకలో లిక్కర్ వ్యాపారుల సమ్మెబాట - ఒక రోజు బంద్ - కారణమేమిటంటే ?